కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాజుల కూడా జంప్?

March 14, 2019


img

పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెరాసలో చేరుతున్నట్లు ఈరోజే ప్రకటించారు. ఆ షాక్ నుంచి కాంగ్రెస్‌ నేతలు తేరుకోకమునుపే నిజామాబాద్‌ జిల్లాలో ఎల్లారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాజుల సురేందర్ కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి తెరాసలో చేరిపోవడానికి సిద్దం అవుతున్నారు. ఈనెల 19వ తేదీన నిజామాబాద్‌లో జరుగబోయే తెరాస ఎన్నికల ప్రచారసభలో సిఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోవడానికి సిద్దం అవుతున్నట్లు తాజా సమాచారం. 

ఈ వారంరోజుల వ్యవదిలోనే ఆత్రం సక్కు, రేగా కాంతారావు, చిరుమర్తి లింగయ్య, సబితా ఇంద్రారెడ్డి, కందాల ఉపేందర్ రెడ్డి, జాజుల సురేందర్‌తో కలిపి మొత్తం ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటంతో పార్టీలో ఇక 13మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలిలారు. ఈ ఫిరాయింపుల జోరు చూస్తుంటే త్వరలోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయి ఏపీలోని కాంగ్రెస్‌ మాదిరిగా ‘వన్ మ్యాన్ ఆర్మీ’గా మారిపోతుందేమోననిపిస్తోంది. 

తెరాసలోకి వెళ్లిపోయే ఎమ్మెల్యేలను, నేతలను ఆపడం కష్టమని స్పష్టం అయ్యింది కనుక ఇకపై రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు లోక్‌సభ ఎన్నికలపై దృష్టిపెట్టి గట్టిగా పనిచేసుకుపోవడం మంచిది. కానీ ఎన్నికల తరువాత గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీలు మళ్ళీ తెరాసలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది కనుక పార్టీకి అత్యంత విధేయులైన వారిని గుర్తించి టికెట్లు ఇచ్చుకోవడం మంచిది. లేకుంటే కష్టం కాంగ్రెస్  పార్టీది...పాయసం తాగేది తెరాస అన్నట్లవుతుంది. 


Related Post