సీతక్కను బరిలో దింపితే...

March 09, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకొని మళ్ళీ రాష్ట్ర రాజకీయాలపై తన పట్టు నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలు అభ్యర్ధులలో గెలుపు గుర్రాల కోసం గాలిస్తున్నారు. ఆ ప్రయత్నంలో మహబూబాబాద్ నుంచి ములుగు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్కను నిలబెట్టాలని ఆలోచిస్తున్నారు. ఆదిలాబాద్ సీటును లంబడాలకు కేటాయిస్తునందున, మహబూబాబాద్ సీటును కోయ సామాజికవర్గానికి చెందిన సీతక్కకు కేటాయించినట్లయితే విజయావకాశాలు మెరుగవుతాయని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. కనుక మహబూబాబాద్ నుంచి పోటీ చేయాలనుకొంటున్న బెల్లయ్య నాయక్, బలరాం నాయక్, రాములు నాయక్, చీమల వెంకటేశ్వర్లతో పాటు ఇప్పుడు సీతక్క పేరును కూడా పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 4 స్థానాలను గెలుచుకొన్నప్పటికీ, వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు హరిప్రియ (ఇల్లెందు), రేగా కాంతారావు (పినపాక) తెరాసలో చేరడంతో జిల్లాలో కాంగ్రెస్ శ్రేణులు డీలాపడ్డాయి. సీతక్కను లోక్‌సభకు పోటీ చేయించినట్లయితే మళ్ళీ వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

సీతక్క వంటి బలమైన మహిళా నేతను లోక్‌సభ ఎన్నికల బరిలో దింపాలనుకోవడం మంచిదే. కానీ మహబూబాబాద్ నలుగురు బలమైన అభ్యర్ధులు పోటీకి సిద్దంగా ఉండగా వారిని కాదని ఎమ్మెల్యేగా ఉన్న సీతక్కను లోక్‌సభకు పోటీ చేయించాలనుకోవడం కాంగ్రెస్ పార్టీకి ఆత్మహత్యతో సమానమని చెప్పవచ్చు. 

ఒకవేళ ఆమె గెలిస్తే ఆమె తన ఎమ్మెల్యే పదవిని వదులుకోవలసి ఉంటుంది. అప్పుడు ఉపఎన్నికలలో ఆసీటును కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుచుకొంటుందనే నమ్మకం లేదు. ఎన్నికలలో గెలిచి సీతక్క డిల్లీకి షిఫ్ట్ అయితే జిల్లాలో కాంగ్రెస్‌ మరింత బలహీనపడే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ తెరాస చేతిలో సీతక్క ఓడిపోతే కాంగ్రెస్‌ పార్టీ బలహీనతను స్వయంగా చాటి చెప్పుకొన్నట్లవుతుంది. కనుక నలుగురు అభ్యర్ధులలో ఎవరో ఒకరిని ఎంచుకోవడం మంచిది.


Related Post