సుష్మ స్వరాజ్ మంచి ప్రశ్నే వేశారు

March 14, 2019


img

భారత్‌-పాక్‌ దేశాల మద్య యుద్ధమేఘాలు తొలగిపోయినప్పటికీ, ఇరుదేశాల వైఖరిలో మార్పు లేదు కనుక ఇరుదేశాల మద్య సంబంధాలు కూడా మెరుగుపడలేదు. ప్రపంచదేశాల ఒత్తిడితో భారత్‌ పైలట్ అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించి పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ శాంతిమంత్రం పటిస్తున్నప్పటికీ, నేటికీ భారత్-పాక్‌ సరిహద్దులలో పాక్‌ దళాలు కాల్పులు జరుపుతూనే ఉన్నాయి. పాక్‌ డ్రోన్ కెమెరాలు భారత సరిహద్దులలో ప్రవేశిస్తూనే ఉన్నాయి. పాక్‌ యుద్ధవిమానాలు బుదవారం ‘లైన్ ఆఫ్ కంట్రోల్’ దాటి భారత్‌ వైపు చక్కర్లు కొట్టి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశాయి కూడా. ఈ నేపధ్యంలో కూడా భారత్‌-పాక్‌ మద్య శాంతి చర్చలు జరగాలని కొన్ని దేశాలు, కొన్ని పార్టీలు ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి. వాటికి భారత్‌ విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ చక్కటి సమాధానం చెప్పారు. 

డిల్లీలో బుదవారం జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆమెను ఒక విలేఖరి ఇదే ప్రశ్న అడిగినప్పుడు, “పాక్‌లో ఆశ్రయం పొందుతున్న జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మన సైనికులను పొట్టనపెట్టుకొంది. అందుకు ప్రతిగా మన వాయుసేన వారి శిబిరాలపై దాడులు చేసి మట్టుబెడితే పాక్‌ పాలకులు జైష్-ఏ-మహమ్మద్ సంస్థను వెనకేసుకొని వచ్చి మనపై వాయుసేనపై దాడికి ప్రయత్నించారు. మన పోరాటం కేవలం ఉగ్రవాదులతోనే తప్ప పాకిస్థాన్‌తో కాదు. కానీ పాక్‌ పాలకులకు మన వాయుసేనను లక్ష్యంగా చేసుకోవడం సమంజసమా? మనతో ఈవిధంగా ప్రవర్తిస్తున్నవారితో చర్చలు ఏవిధంగా సాధ్యం? 

ఒకవేళ పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు అంత ఔదార్యం, ధైర్యమే ఉన్నట్లయితే భారత్‌పై పదేపదే దాడులు చేస్తూ వందలాదిమంది అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న తీవ్రవాది మసూద్ అజర్‌ను భారత్‌కు అప్పగించవచ్చు కదా? కానీ అతనిపై చర్యలు తీసుకోవడానికి కూడా ఇమ్రాన్ ఖాన్‌ భయపడుతున్నారు. భారత్‌పై దాడులు చేస్తున్న మసూద్ అజర్‌ వంటి ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న దేశంతో శాంతి చర్చలు చేయడం వలన ఏమి ప్రయోజనం? పాక్‌తో చర్చలు మొదలుపెట్టాలంటే ముందుగా అక్కడి ఉగ్రవాదులను నిర్మూలించాలి. అప్పుడే సాధ్యం,” అని సుష్మా స్వరాజ్ చెప్పారు. 


Related Post