కేసీఆర్‌ టార్గెట్ అదేనా?

March 14, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ అనే ఒక అనూహ్య ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. “జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్నామని” చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికలలో వరుసగా రెండవసారి ఘనవిజయం సాధించిన తరువాత ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు తెరాస చెపుతున్న కారణంలో చాలా మార్పు వచ్చింది. “కేంద్రంలో చక్రం తిప్పుతామని, డిల్లీ పాలకుల మెడలు వంచి అన్ని సాధించుకొంటామని” తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ చెపుతుండటం అందరూ వింటూనే ఉన్నారు. ఇది కూడా గుణాత్మకమైన మార్పే!

నిన్న జరిగిన సికిందరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో జాతీయ రాజకీయాల గురించి కేటీఆర్‌ మాట్లాడిన మాటలలో మరికొంత మార్పు కనబడింది. “అయితే నరేంద్రమోడీ లేకుంటే రాహుల్ గాంధీ ఇద్దరే ప్రధానమంత్రులుగా ఉండాలా? దేశంలో వేరెవరూ అందుకు అర్హులు లేరా?” అని ప్రశ్నించారు. అంటే “కేసీఆర్‌ ప్రధానమంత్రి కాకూడదా?”అని అడిగినట్లుంది.   

ప్రధాని పదవికి పోటీపడుతున్నవారి గురించి బాగానే చర్చ నడుస్తోంది కానీ వారిలో ‘అర్హుల’ గురించి పెద్దగా చర్చ జరగడం లేదనే చెప్పాలి. ఆ అర్హత పాయింటునే కేటీఆర్‌తో సహా తెరాస నేతలు గట్టిగా నొక్కి చెపుతున్నారు. “తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలో నడిపిస్తున్న కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశం కోరుకొంటోంది...దేశానికి కేసీఆర్‌ నాయకత్వం వహించాల్సిన సమయం ఆసన్నమైంది...కేసీఆర్‌ పాలన, సంక్షేమ పధకాలు దేశానికే ఆదర్శం. అవి దేశమంతటికీ విస్తరించాలంటే కేసీఆర్‌ ప్రధానమంత్రి అవ్వాలి...” వంటి మాటలు తెరాస నేతల నోట తరచూ వింటూనే ఉన్నాము. వాటిని సిఎం కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ ఏనాడూ ఖండించలేదు. అంటే కేసీఆర్‌ మనసులో మాటలనే లేదా ఆయన భవిష్య  ప్రణాళికలనే తెరాస నేతలు ఈవిధంగా బయటపెడుతూ ప్రజల నాడి తెలుసుకొంటూ అదే సమయంలో వారిని మానసికంగా సిద్దం చేస్తున్నారని చెప్పవచ్చు. నిన్న కేటీఆర్‌ అన్న మాటలు కూడా అదే సూచిస్తున్నాయి. 

‘కేసీఆర్‌కు ప్రధానమంత్రి అవ్వాలని మనసులో కోరిక ఉన్నప్పటికీ ఆ విషయం మరి పైకి ఎందుకు చెప్పడం లేదు?’ అనే సందేహం కలుగవచ్చు. లోక్‌సభ ఎన్నికల తరువాత డిల్లీలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయో ఎవరికీ తెలియదు. లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలలో ఏది గెలుస్తుందో ఏది ఓడిపోతుందో తెలియదు. కేటీఆర్‌ చెపుతున్నట్లుగా రెండూ ఓడిపోతాయోమో కూడా తెలియదు. ఒకవేళ ఆ రెండూ ఓడిపోయి ఫెడరల్‌ ఫ్రంట్‌కు చక్రం తిప్పే అవకాశమే వచ్చినా దానిలో కూడా ప్రధాని పదవికి రేసులో అనేకమంది ఉత్తరాదినేతలున్నారు. కేసీఆర్‌ ప్రధాని కావాలంటే ముందుగా వారందరినీ ఒప్పించాలి. ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టాల్సి ఉంటుంది. ఇది ఎంత కష్టమో తేలికగానే ఊహించుకోవచ్చు. ఒకవేళ బిజెపి లేదా కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికలలో పూర్తిమెజారిటీ సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే ఇక కేసీఆర్‌ ప్రధాని కలలను మరిచిపోక తప్పదు. కనుక ప్రధానమంత్రి కల గురించి ఇప్పుడే బయటపెట్టుకోవడం తొందరపాటే అవుతుంది. పైగా పైకి చెప్పుకొన్నాక ప్రధాని కాలేకపోతే నవ్వులపాలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే కేసీఆర్‌ తన మనసులోని ఈ ఆలోచనను బయటపెట్టడంలేదని చెప్పవచ్చు. 

లోక్‌సభ ఎన్నికల తరువాత పరిస్థితులు అనుకూలిస్తే ప్రయత్నాలు మొదలుపెడతారు లేకుంటే అవకాశాలు, అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి కేంద్రప్రభుత్వంలో చేరి మంత్రిపదవితో సర్దుకుపోవచ్చు అదీ కుదరకపోతే యధాప్రకారం ముఖ్యమంత్రిగా కొనసాగే వెసులుబాటు ఎలాగూ ఉంది. 

అయితే కేసీఆర్‌ టార్గెట్ ఫిక్స్ చేసుకొన్నారు దాని కోసం తెలంగాణ ప్రజల మద్దతు కూడగట్టేందుకు తెరాస నేతల ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికలలో తెరాస 16 సీట్లను గెలుచుకొని చూపిస్తేనే జాతీయస్థాయిలో పార్టీలు కేసీఆర్‌ మాట వినేందుకు ఆసక్తి చూపుతాయి లేకుంటే పట్టించుకోవు కనుకనే తెరాస ‘16 సీట్ల పాట’ పాడుతోందని భావించవచ్చు.


Related Post