రేవంత్‌ రెడ్డి పోటీపై అంత గోప్యత దేనికో?

March 14, 2019


img

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డికి డిల్లీ నుంచి పిలుపు రావడంతో బుదవారం హడావుడిగా డిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా లోక్‌సభకు పోటీ చేయడానికి సిద్దమని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆయనను మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తున్నట్లు తాజా సమాచారం. ఆ విషయం గురించి చర్చించడానికే ఆయనను డిల్లీకి పిలిపించినట్లు సమాచారం. కనుక నేడో రేపో కాంగ్రెస్‌ విడుదల చేయబోయే అభ్యర్ధుల జాబితాలో ఆయన పేరు కూడా ఉండే అవకాశం ఉంది. 

రాష్ట్ర కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీ ఒక్కో నియోజకవర్గానికి అర్హులైన ముగ్గురు అభ్యర్ధుల పేర్లతో కూడిన జాబితాను రూపొందించి కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపించింది. రేవంత్‌ రెడ్డి తాను కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేస్తానని చెపుతున్నప్పటికీ ఆ జాబితాలో ఆయన పేరు లేకపోవడం విశేషం. 

రేవంత్‌ రెడ్డి తెరాసకు ప్రధాన టార్గెట్ అనే సంగతి అసెంబ్లీ ఎన్నికలలోనే రుజువైంది కనుక కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్యపూర్వకంగానే ఆయన పేరును జాబితాలో చేర్చకుండా రహస్యంగా ఉంచి ఉండవచ్చు. జాబితాలో పేరు లేకపోయినప్పటికీ ఆయన పోటీ చేయడం ఖాయమని అందరికీ తెలుసు. అందుకే తెరాస కూడా తమ అభ్యర్ధుల జాబితాను ప్రకటించకుండా కాంగ్రెస్‌ జాబితా కోసం వేచి చూస్తోంది. రేవంత్‌ రెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేయడం ఖరారైనట్లయితే, ఆయనను ఎదుర్కొనేందుకు ధీటైన అభ్యర్ధిని ఎంచుకొని ఆయనను మళ్ళీ ఓడించేందుకు సిఎం కేసీఆర్‌ ప్రత్యేక వ్యూహం సిద్దం చేయడం తధ్యం. 

రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే తెరాస వలయంలో నుంచి బయటపడగలుగుతారు. ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తెరాసకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదే..లోక్‌సభ ఎన్నికలలో కూడా ఓడించగలిగితే రేవంత్‌ రెడ్డి రాజకీయ జీవితం ఆగమ్యగోచరంగా మారుతుంది. ఈవిషయం కాంగ్రెస్, తెరాస, రేవంత్‌ రెడ్డికి కూడా బాగా తెలుసు. బహుశః అందుకే రేవంత్‌ రెడ్డి పోటీ చేయబోయే నియోజకవర్గం గురించి కాంగ్రెస్‌ పార్టీ ఇంత గోప్యత పాటిస్తోందనుకోవచ్చు. 

ఏదిఏమైనప్పటికీ, నామినేషన్లకు ఈ నెల 25తో గడువు ముగుస్తుంది కనుక ఆలోగానే రేవంత్‌ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయం తేలిపోతుంది. అప్పటి నుంచి తెరాస వ్యూహం అమలుచేయకమానదు.


Related Post