నారా లోకేష్‌ మంగళగిరికి షిఫ్ట్ అయినా...

March 13, 2019


img

ఏపీ సిఎం చంద్రబాబునాయుడు రాజకీయ వారసుడు నారా లోకేష్‌ మొట్టమొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయబోతున్నారు. కనుక ఆయనకు ‘సేఫ్ ల్యాండింగ్’ కల్పించవలసిన బాధ్యత పార్టీపైనే ఉంది. మొదట…విశాఖ జిల్లాలోని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. కానీ అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేయాలని భావిస్తున్న మంత్రి గంటా అభ్యంతరం చెప్పి ఉండవచ్చు లేదా వైసీపీ నుంచి అక్కడ గట్టి పోటీ ఉంటుందనే భయం కావచ్చు. దాంతో అక్కడి నుంచి విశాఖ ఉత్తరం నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యారని వార్తలు వచ్చాయి. కానీ చిన్నబాబుకి మళ్ళీ అక్కడేమి సమస్య వచ్చిందో తెలియదు కానీ ఈసారి అక్కడి నుంచి గుంటూరు జిల్లాలో మంగళగిరికి షిఫ్ట్ అయిపోయారు. 

అక్కడ టిడిపికి మంచి పట్టుంది పైగా తండ్రి అధికారనివాసం కూతవేటు దూరంలో ఉండవల్లిలోనే ఉంది. కనుక అక్కడైతే సేఫ్ అని టిడిపి అధిష్టానం భావించి నారా లోకేష్‌కు మంగళగిరి నియోజకవర్గాన్ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి టిడిపిని కోర్టుకేసులతో ముప్పాతిప్పలు పెట్టిన ఘనుడు. ఆయన మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారు. కనుక నారా లోకేష్‌కు ఆయన గట్టిపోటీ ఈయవచ్చు. ఒకవేళ నారా లోకేష్‌ గెలిస్తే పరువాలేదు కానీ ఆయన చేతిలో ఓడిపోతే అది టిడిపికి అవమానం అవుతుంది.


Related Post