నామా నాగేశ్వరరావు కాంగ్రెస్‌లోకి జంప్?

March 13, 2019


img

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో టిడిపి భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో చాలామంది నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్‌ లేదా తెరాసలలో చేరిపోతున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ప్రముఖ టిడిపి నేత నామా నాగేశ్వరరావు వంతు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన తరువాత వెంటనే వస్తున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి ఆయన సిద్దం అయ్యారు. 

కాంగ్రెస్‌-టిడిపిల పొత్తులు బెడిసికొట్టిన నేపధ్యంలో లోక్‌సభ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు పొత్తులు పెట్టుకోలేదు. అలాగని ఆ రెండు పార్టీల మద్య స్నేహసంబందాలు దెబ్బతినలేదు కూడా. కనుక కాంగ్రెస్ పార్టీతో టిడిపి పోటీ పడినట్లయితే దానికి నష్టం, తెరాసకు లాభం చేకూరుతుంది. బహుశః అందుకే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటికీ టిటిడిపి నేతలు ఉలుకుపలుకూ లేకుండా కూర్చోన్నారు. 

కానీ రాజకీయాలలో ఉన్నవారు ఎన్నికలొచ్చినప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోంటే వారి రాజకీయ భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారే ప్రమాదం ఉంటుంది కనుక టిడిపి అధిష్టానం అంగీకరిస్తే టిడిపి తరపున లేకుంటే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి ఆ పార్టీ తరపున ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని నామా నాగేశ్వరరావు నిశ్చయించుకొన్నారు. ఆయన మంగళవారం అమరావతి వెళ్ళి టిడిపి అధినేత చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యి దీని గురించి మాట్లాడారు. కానీ ఇంతవరకు టిటిడిపి నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. అంటే చంద్రబాబునాయుడు అనుమతించలేదని భావించవచ్చు. కనుక నామా నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా అటువంటి బలమైన అభ్యర్ధి కోసమే చూస్తోంది కనుక ఆయనకు టికెట్ ఇవ్వవచ్చు. తెరాస తరపున తుమ్మల నాగేశ్వరరావును బరిలో దింపే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Related Post