లోక్‌సభ ఎన్నికలలో టిటిడిపి పోటీ చేస్తుందా?

March 13, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని ఒక అనూహ్యమైన వ్యూహంతో ప్రజల ముందుకు వచ్చిన టిడిపి ఆశించిన ఫలితాలు రాబట్టడంలో విఫలమైంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొన్న కారణంగా టిడిపి కొత్తగా ఏమీ నష్టపోలేదు కానీ టిడిపితో పొత్తు పెట్టుకొన్నందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. అదే…టిడిపితో పొత్తు పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి ఉండి ఉంటే ఫలితం మరోవిధంగా ఉండేదని కాంగ్రెస్‌ నేతలే అనుకొంటున్నారు. కాంగ్రెస్‌-టిడిపిల పొత్తులు బెడిసికొట్టినందున రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ పార్టీలు మళ్ళీ పొత్తుల ఆలోచనలు చేయడంలేదు. ఏపీలో జరుగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు వేర్వేరుగానే పోటీ చేయబోతున్నాయి. అయితే రాహుల్ గాంధీ- చంద్రబాబునాయుడు మద్య స్నేహం కొనసాగూతూనే ఉంది కనుక జాతీయస్థాయిలో ఆ రెండూ కలిసే పనిచేస్తున్నాయి. 

ఏప్రిల్ 11న జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలకు పోటీ చేయబోతోంది కానీ టిడిపి ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమకు బలం ఉన్న ఖమ్మం, సికిందరాబాద్‌ వంటి రెండు మూడు నియోజకవర్గాలలో మాత్రమే పోటీ చేసేందుకు టిడిపి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

టిడిపి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేష్ గౌడ్ మంగళవారం తన నివాసంలో ఒక సమావేశం నిర్వహించారు. నగరానికి చెందిన టిడిపి ముఖ్యనేతలు దానిలో పాల్గొన్నారు. సికిందరాబాద్‌ నియోజకవర్గంలో టిడిపికి పట్టుంది కనుక కూన వెంకటేష్ గౌడ్ పోటీ చేయాలనే ప్రతిపాదనపై ఆ సమావేశంలో చర్చించారు. ఈ ప్రతిపాదనకు పార్టీ ఆమోదం తెలిపితే తాను సికిందరాబాద్‌ నుంచి పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో టిడిపి పోటీ చేస్తుందా లేక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి ఎన్నికలకు దూరంగా ఉంటుందా? అనే విషయం ఒకటిరెండు రోజులలోనే తెలుస్తుంది.


Related Post