మమత సంచలన నిర్ణయం...ఇతర పార్టీలకు సవాల్

March 12, 2019


img

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికలలో 41 శాతం సీట్లు మహిళలకు కేటాయించారు. మొత్తం 17 మంది మహిళా అభ్యర్ధులకు అవకాశం కల్పించారు. వారిలో ప్రముఖ బెంగాలీ నటీమణులు మూన్ మూన్ సేన్, నూస్రత్ జహాన్, మిమీ చక్రవర్తిలకు టికెట్లు కేటాయించారు. రాష్ట్రంలో 42 స్థానాలు ఉండగా వాటిలో 19 మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి వారి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించారు. మమతా బెనర్జీ తీసుకొన్న ఈ రెండు సంచలన నిర్ణయాలతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో ప్రకంపనలు మొదలయ్యాయి. 

తృణమూల్ అభ్యర్ధుల జాబితాను ప్రకటించిన తరువాత మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలు మా పార్టీ 41 శాతం స్థానాలను మహిళలకు కేటాయించిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. అనేకపార్టీలు చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ ప్రసంగాలతోనే కాలక్షేపం చేస్తుంటే మేము మహిళలకు 41 శాతం టికెట్లు కేటాయించి ఆచరణలో చూపాము. ఇతర పార్టీలకు ఇప్పుడు నేను సవాలు విసురుతున్నాను. రాజకీయాలలో మహిళలకు సముచితస్థానం కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే లోక్‌సభ ఎన్నికలలో మహిళలకు కనీసం 33 శాతం లేదా అంతకంటే ఎక్కువ సీట్లు కేటాయించాలని నేను సవాలు చేస్తున్నాను. నా సవాలును ఎవరైనా స్వీకరించగలరా?” అని అన్నారు. 

ఈ విషయంలో మమతా బెనర్జీని అభినందించక తప్పదు. ఒకపక్క బిజెపి నుంచి గట్టి పోటీ ఎదురవుతుంటే ఏకంగా 19మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేయడమే కాకుండా 17మంది మహిళలకు అవకాశం కల్పించి తన ఆత్మవిశ్వాసం చాటుకొన్నారు. 

ఒడిశాలోని అధికార బిజెడి అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రెండు రోజుల క్రితమే లోక్‌సభ ఎన్నికలలో తమ పార్టీ మహిళలకు 33 శాతం టికెట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రధానపార్టీలు ఈవిషయంలో ఎప్పుడూ మాటలకే పరిమితం అవుతున్నాయి తప్ప ఆచరణలో పెట్టలేకపోతున్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగిలిన పార్టీలకంటే మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తోంది. నేడో రేపో అన్ని పార్టీలు తమతమ అభ్యర్ధుల జాబితాలను విడుదల చేస్తాయి కనుక మహిళలకు ఏ పార్టీ ఎన్ని సీట్లు కేటాయిస్తాయో చూద్దాం. 


Related Post