తెరాసలో తిరుగుబాటు తధ్యం: వి.హనుమంతరావు

March 12, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులు, తెరాస భవిష్యత్ పై జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా ఎమ్మెల్యేలను తెరాసలోకి ఫిరాయింపజేసి కాంగ్రెస్ పార్టీలో సునామీ సృష్టించాలని సిఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. కానీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టిన మరుక్షణం తెరాసలో తిరుగుబాటు వచ్చి సునామీ ఏర్పడుతుంది. ఆ భయంతోనే కేసీఆర్‌ ముందుజాగ్రత్తగా మా ఎమ్మెల్యేలను కూడా తెరాసలోకి రప్పించుకొంటున్నారు. తెరాసలో చేరిన కొంతమంది కాంగ్రెస్‌ నేతలు మాకు ఫోన్లు చేసి తమ గోడు వెళ్లబోసుకొంటున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఎన్నడూ అపాయింట్మెంట్ దొరకదని మాకు చెప్పుకొని బాధపడుతుంటారు. తెరాసలోకి వచ్చేవారికి రెడ్ కార్పెట్ పరిచి ఘనస్వాగతం పలుకుతారని, బయటకు పంపేవారి కోసం వేరేగా ‘రిటర్న్ కార్పెట్’ కూడా తెరాసలో సిద్దంగా ఉంటుంది. కేటీఆర్‌ సిఎం అయిన తరువాత తెరాస నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మొదలవుతాయి,” అని వి.హనుమంతరావు అన్నారు.

వి.హనుమంతరావు జోస్యం మంచి ‘స్పైసీ’గా ఉంది కనుక వినేందుకు బాగానే ఉంటుంది. కానీ ఆయన ఊహించుకొంటున్నట్లు తెరాసలో ఏనాడూ ఆవిధంగా తిరుగుబాటు వచ్చే అవకాశం లేదు. తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావలసిన అవసరం అంతకంటే ఉండదు. ఎందుకంటే, ఇప్పటికే కేటీఆర్‌ తన సమర్ధతను, నాయకత్వ లక్షణాలను నిరూపించుకొని ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడనిపించుకొంటున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారనే నమ్ముతున్నారు. కావాలనే కోరుకొంటున్నారు. కనుక తెరాసలో అందరూ మానసికంగా సిద్దపడి ఉన్నప్పుడు ఇక తిరుగుబాటు ఎందుకు చేస్తారు? ఒకవేళ చేస్తే వారే నష్టపోతారు తప్ప తెరాస... కేటీఆర్‌ కాదనే సంగతి అందరికీ తెలుసు కనుక వి.హనుమంతరావు కబుర్లు కాలక్షేపానికే తప్ప మరి దేనికీ పనికిరావు.


Related Post