కాంగ్రెస్ పార్టీలోనే సబితా ఇంద్రారెడ్డి?

March 12, 2019


img

గత ఎన్నికలకు ముందు తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు ఎంత దయనీయంగా మారాయో, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తెరాసలో చేరిపోతున్నట్లు ప్రకటించగా, పార్టీలో సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి తెరాసలోకి వెళ్లిపోయేందుకు సిద్దం అయ్యారు. 

కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయంగా ఎదిగి, పార్టీ అధికారంలో ఉన్నన్నాళ్ళు అధికారం, పదవులు అనుభవించి, కష్టకాలంలో పార్టీని విడిచిపెట్టి తెరాసలోకి క్యూ కడుతున్న కాంగ్రెస్‌ నేతలను తెరాస అక్కున చేర్చుకొంటుండవచ్చు కానీ అటువంటి అవకాశవాద రాజకీయనేతలను వారు చేస్తున్న ఇటువంటి అవకాశవాద రాజకీయాలను చూస్తున్న ప్రజలకు రాజకీయాలంటే అసహ్యం, చులకనభావం ఏర్పడటం సహజమే. 

కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో బలమైన నేతగా పేరున్న సబితా ఇంద్రారెడ్డి తెరాసలోకి వెళ్ళిపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరుగుతుంది. కనుక చివరి ప్రయత్నంగా తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి నిన్న ఆమె ఇంటికి వెళ్ళి ఆమెకు నచ్చజెప్పారు. “తెరాస ఇమడలేకనే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారని...మీరు వెళ్ళినా ఇమడలేరని కనుక కాంగ్రెస్ పార్టీలో కొనసాగడమే మంచిదని” నచ్చజెప్పడంతో ఆమె మనసుమార్చుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలనుకొంటున్నట్లు తాజా సమాచారం. 

ఈరోజు సాయంత్రం ఆమెను వెంటబెట్టుకొని రేవంత్‌ రెడ్డి డిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలువనున్నారు. తాము కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలంటే చేవెళ్ళ లేదా సికిందరాబాద్‌ టికెట్ తన కొడుకు కార్తీక్ రెడ్డికి ఇవ్వాలని ఆమె షరతు విధిస్తారేమో?చేవెళ్ళకు ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి మళ్ళీ పోటీ చేయాలనుకొంటున్నారు. ఆయనకు చేవెళ్ల నియోజకవర్గంలో మంచి పేరుంది. పైగా చాలా బలమైన అభ్యర్ధి కనుక ఆ సీటును కార్తీక్ రెడ్డికి ఇచ్చేందుకు రాహుల్ గాంధీ అంగీకరించకపోవచ్చు. కనుక సబితా ఇంద్రారెడ్డి తన కొడుకుకు టికెట్ లభించకపోయినా కాంగ్రెస్ పార్టీలో సర్దుకుపోతారో లేక మళ్ళీ తెరాసవైపు పరుగులు తీస్తారో ఒకటిరెండు రోజులలోనే తేలిపోనుంది 


Related Post