ఇద్దరు లోక్‌సభ అభ్యర్ధులను ప్రకటించిన పవన్‌కల్యాణ్‌

March 11, 2019


img

గత ఎన్నికలకు ముందు పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఎన్నికలలో పోటీ చేయకుండా టిడిపి-బిజెపిలకు మద్దతు ప్రకటించారు. కానీ ఆ రెండు పార్టీలు విడిపోయి పరస్పర విమర్శలు ఆరోపణలు చేసుకొంటూ బద్దశత్రువులులా వ్యవహరిస్తున్నాయిప్పుడు. ఈ నేపధ్యంలో పవన్‌కల్యాణ్‌ సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిసమయం పార్టీకే కేటాయించి త్వరలో జరుగబోయే లోక్‌సభ, ఏపీ శాసనసభ ఎన్నికలకు సిద్దం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో అభ్యర్ధులను ఖరారు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే 32 మంది అభ్యర్ధుల పేర్లను ఖరారు చేశామని మిగిలినవారిని, మరో 9 మంది లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను కూడా ఒకటిరెండు రోజులలో వెల్లడిస్తామని పవన్‌కల్యాణ్‌ తెలియజేశారు. ఈరోజు సాయంత్రం రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించారు. అమాలాపురం నుంచి రిటైర్డ్ అధికారి డిఎం రాజశేఖర్‌, రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి ఆకుల సత్యనారాయణల పేర్లు ఖరారు చేశామని పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. వారిలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బిజెపి నుంచి జనసేనలో చేరారు. 

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ వాతావరణం చూస్తుంటే ఈసారి కూడా పోటీ ప్రధానంగా టిడిపి-వైసీపీల మద్యనే సాగబోతున్నట్లు కనిపిస్తోంది. పైగా ఈసారి జగన్‌మోహన్‌రెడ్డికి అన్నీ అనుకూలంగా కలిసివస్తుండటంతో టిడిపి-వైసీపీల మద్య పోటీ మరింత తీవ్రంగా ఉండవచ్చు. వాటి మద్య కాంగ్రెస్‌, బిజెపి, జనసేన, వామపక్షాలున్నాయి. అవన్నీ ఆ రెండు పార్టీల ఓట్లను చీల్చగలవు తప్ప సొంతంగా ఏదీ మెజారిటీ సాధించలేకపోవచ్చు. 


Related Post