ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం: ఉత్తమ్

March 11, 2019


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపుల నేపద్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయించింది. ఈరోజు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో ప్రతిపక్షమే ఉండకూడదన్నట్లు వ్యవహరిస్తూ సిఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యాన్ని  ఖూనీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలలో పూర్తిమెజార్టీతో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ, ప్రతిపక్షాలను బలహీనపరచడానికి ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ సిఎం కేసీఆర్‌ వికృత రాజకీయాలు చేస్తున్నారు. అత్యంత హుందాగా సాగవలసిన పెద్దలసభ ఎన్నికలను గ్రామస్థాయి ఎన్నికల కంటే హీనంగా దిగజార్చేశారు. స్పీకర్, డెప్యూటీ స్పీకర్ ఎన్నికకు మేము ప్రభుత్వానికి సహకరించి హుందాగా వ్యవహరించాము. కానీ సిఎం కేసీఆర్‌ మా పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తెరాసలోకి ఫిరాయించుకొంటున్నారు. కనుక తెరాస వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నాము. తెరాస చేస్తున్నే ఈ అకృత్యాలను, అనుసరిస్తున్న ఈ అప్రజాస్వామిక పద్దతులను ప్రజలకు తెలియజేసి వారిని చైతన్యపరచాలని నేను మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

అసెంబ్లీ ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొంటాము. లోక్‌సభ ఎన్నికల ద్వారా కేంద్రప్రభుత్వాన్ని, ప్రధానమంత్రిని ఎన్నుకోవడం జరుగుతుంది. కనుక కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడి ప్రజాస్వామ్యబద్దంగా పాలన చేసేందుకు లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నాను,” అని అన్నారు. 

 ఎమ్మెల్యేల కోటాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో తెరాస, మజ్లీస్ పార్టీలు కలిసి తమకున్న ఎమ్మెల్యేలతో నలుగురు అభ్యర్ధులను గెలిపించుకోవచ్చు. కాంగ్రెస్‌, టిడిపిలు కలిసి ఒక అభ్యర్ధిని గెలిపించుకోవచ్చు. కానీ తెరాస నలుగురిని, మజ్లీస్ ఒక అభ్యర్ధిని బరిలో దింపడంతో పోటీ అనివార్యం అయ్యింది. వాటితో కాంగ్రెస్ పార్టీ పోటీకి సిద్దమై తమ అభ్యర్ధిగా గూడూరు నారాయణ రెడ్డిని నిలబెట్టింది. కానీ జోరుగా సాగుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపుల కారణంగా కాంగ్రెస్‌ శాసనసభ్యుల సంఖ్య 14కు పడిపోవడంతో ఒక్క ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేని దుస్థితి ఏర్పడింది. కనుక తపనిసరి పరిస్థితులలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించి పోటీ నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీపై తెరాస పైచేయి సాధించినప్పటికీ, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించి తీరని అప్రాదిష్ట మూటగట్టుకొంటోందని చెప్పకతప్పదు.


Related Post