మంత్రి పదవి కోరుకొంటే తప్పేమిటి? అలీ

March 11, 2019


img

ఈరోజు వైసీపీలో చేరిన ప్రముఖ హాస్యనటుడు అలీ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “నాకు పార్టీ టికెట్ ఇస్తే   రాజమండ్రీ నుంచి పోటీ చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డిని అడిగాను. కానీ ఇప్పటికే ఆ టికెట్ వేరేవారికి కేటాయించినందున ఇప్పుడు ఇవ్వలేనని చెప్పారు. కానీ రానున్నరోజులలో తానే అవకాశం కల్పిస్తానని చెప్పారు. ఆయన మాట ఇస్తే కట్టుబడి ఉంటారు. కనుక నేను టికెట్ కోసం ఇక ఒత్తిడి చేయలేదు. ఏప్రిల్ 11న జరుగబోయే లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో నేను వైసీపీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొని పార్టీ విజయానికి గట్టిగా కృషి చేస్తాను. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఏపీ ప్రజలు కోరుకొంటున్నారు. నేను కూడా కోరుకొంటున్నాను. ఈసారి జగన్‌మోహన్‌రెడ్డి తప్పకుండా ఏపీ సిఎం అవుతారని భావిస్తున్నాను,” అని అన్నారు. 

“పవన్‌కల్యాణ్‌తో స్నేహం ఉన్నప్పటికీ వైసీపీలో ఎందుకు చేరారనే” విలేఖరి ప్రశ్నకు సమాధానంగా, “స్నేహం వేరు రాజకీయాలు వేరు. నాకు నచ్చిన పార్టీలో నేను చేరాను. కానీ అంతమాత్రన్న పవన్‌కల్యాణ్‌ నాకు శత్రువు అయిపోరు కదా? నేను వైసీపీలో చెరినందుకు పవన్‌కల్యాణ్‌ అభిమానులు విమర్శించవచ్చు కానీ వాటిని నేను పట్టించుకోను. ఎన్నికల ప్రచారంలో రాజకీయ విమర్శలు చేసుకోవడం సహజమే కానీ వ్యక్తిగతంగా ఎవరినీ దూషించనవసరం లేదు. దూషిస్తే గెలుస్తామని గ్యారెంటీ లేదు కానీ ప్రజల దృష్టిలో తప్పకుండా చులకనవుతాము,” అని అన్నారు. 

“ఎమ్మెల్యే కూడా కాని మీరు మంత్రి పదవి ఎందుకు ఆశిస్తున్నారు?” అనే విలేఖరి ప్రశ్నకు “నాకు ఇంత పేరు ప్రతిష్టలు, గౌరవం కల్పించిన తెలుగు ప్రజలకు నేనెల్లప్పుడూ రుణపడి ఉంటాను. అందుకే నేను సంపాదించుకొన్న దానిలో కొంత సొమ్ముతో సేవాకార్యక్రమాలు చేస్తున్నాను. కానీ ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలంటే మంత్రిపదవి ఉండాలని నమ్ముతున్నాను. అలా కోరుకోవడం తప్పని నేను భావించడం లేదు. అయినా మంత్రిపదవితో ఇంకా సంపాదించుకోవాలనో లేదా ఏదో దోచుకోవాలనే కోరిక నాకు లేదు. నన్ను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రజలకు మరింత సేవ చేయడమ్ కోసమే మంత్రి పదవి కావాలని కోరుకొంటున్నాను. అది వస్తే అదృష్టమే లేకున్నా బాధపడను,” అని అన్నారు అలీ. 


Related Post