పాక్‌తో దౌత్యయుద్ధం ప్రారంభించిన భారత్‌

March 09, 2019


img

పుల్వామా దాడి, తదనంతర పరిణామాల తరువాత మళ్ళీ ఇరుదేశాల మద్య ప్రశాంత పరిస్థితులు ఏర్పడటంతో మోడీ ప్రభుత్వం చేతులు దులుపుకోలేదు. దౌత్యమార్గాల ద్వారా పాక్‌పై ఒత్తిడి పెంచుతూనే ఉంది. పాక్‌తో చేస్తున్న దౌత్య యుద్ధంలో కూడా భారత్‌ గెలుస్తుందో లేదో తెలియదు కానీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలపై పాక్‌ భద్రతాదళాలు దాడులు చేస్తూ పలువురిని అరెస్ట్ చేస్తున్నాయి. ఇకపై పాక్‌ భూభాగం నుంచి ఉగ్రవాదం కొనసాగడానికి వీలులేదని పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ తెగేసి చెప్పారు. 

పుల్వామా తదనంతర పరిణామాలలో భారత్‌తో యుద్ధానికి సిద్దం అయిన పాక్‌ అకస్మాత్తుగా వెనక్కు తగ్గిందంటే దానికి కారణం అంతర్జాతీయ ఒత్తిడే. కనుక పాకిస్థాన్‌లోని ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఇమ్రాన్ ఖాన్‌ కటినంగా వ్యవహరించాలంటే పాక్‌ ప్రభుత్వంపై నిరంతరంగా అంతర్జాతీయ ఒత్తిడి కొనసాగుతుండాలి. ఆ విషయం భారత్‌ గ్రహించింది కాబట్టే పాక్లో ఉగ్రవాదం తీవ్రత గురించి ఐక్యరాజ్యసమితిలో గట్టిగా మాట్లాడింది. 

సమితిలో మానవహక్కుల మండలి 40వ సదస్సులో భారత శాశ్వత ప్రతినిధి రాజీవ్ చందర్ మాట్లాడుతూ, “ఉగ్రవాదం కూడా పాక్‌ ప్రభుత్వ విధానాలలో భాగంగా మారిపోయింది. ఉగ్రవాదుల దాడుల కారణంగా భారత్‌లో నిత్యం ప్రజలు, జవాన్లు మరణిస్తూనే ఉన్నారు. పాక్‌ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం, శిక్షణ కల్పిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది,” అంటూ పాక్‌ వైఖరిని ఎండగట్టారు. 

భారత్‌ విదేశాంగశాఖ ప్రతినిది రవీశ్ కుమార్ ఈరోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ స్వయంగా ప్రకటించుకొన్నప్పటికీ పాక్‌ ప్రభుత్వం ఇంతవరకు దానిని అంగీకరించడంలేదు. పైగా జైష్ ఆ దాడి చేయలేదని పాక్‌ మంత్రి ప్రకటన చేయడం ఉగ్రవాదం పట్ల పాక్‌ వైఖరికి అద్ధం పడుతోంది. పుల్వామా దాడి విషయంలో భారత్‌ వాదనలను పాక్‌ అంగీకరించడం లేదని స్పష్టం అయ్యింది. పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ చెపుతున్నట్లు నయా పాకిస్థాన్‌ నిర్మించుకోవాలంటే ఉగ్రవాదం పట్ల పాక్‌ వైఖరిలో మార్పు రావాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది,” అని అన్నారు. 

భారత్‌ పట్ల పాక్‌ వైఖరి ఏవిధంగా ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని వదిలించుకోవాలనే తపన, చిత్తశుద్ధి, ధైర్యం పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్నట్లయితే తప్పకుండా భారత్‌-పాక్‌ సంబందాలు కూడా మెరుగుపడతాయి.


Related Post