రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అధికారం ఉంది: హైకోర్టు

March 09, 2019


img

రాష్ట్రంలో కొన్ని పంచాయతీలను సమీప మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ రంగారెడ్డి, ఖమ్మం, సిరిసిల్ల, నిజామాబాద్‌ తదితర జిల్లాల నుంచి హైకోర్టులో మొత్తం 127 పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సహజన్యాయానికి విరుద్దంగా ఉంది కనుయాక్ దానిని రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. 

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం వారి పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ తీర్పు వెలువరిస్తూ, “పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసేందుకు పంచాయతీరాజ్ చట్టంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణలు రాజ్యాంగానికి, చట్టానికి లోబడే ఉన్నాయి. ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, పాలనా సౌలభ్యం వంటివి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడం, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్ గ్రేడ్ చేయడం, కార్పొరేషన్ల పరిధిని విస్తరించడం వంటివి చేస్తుంటాయి. వాటికి ఆ అధికారం ఉంది. కనుక ప్రభుత్వ నిర్ణయం సహజన్యాయానికి విరుద్దంగా ఉందనే కారణంతో కొట్టివేయలేము. పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని తప్పుగా భావించలేము. ఇది పాలనా సంబందిత వ్యవహారం దీనిలో హైకోర్టు జోక్యం చేసుకోదు,” అని స్పష్టం చేశారు.


Related Post