కేటీఆర్‌-హరీష్ సవాళ్ళు మరో కొత్త వ్యూహమా?

March 08, 2019


img

ప్రశాంత్ కిషోర్‌కు గొప్ప ఎన్నికల వ్యూహనిపుణుడని పేరుంది కానీ కేసీఆర్‌ కంటే గొప్ప ఎన్నికల వ్యూహకర్త మరెవరూ ఉండరని గత 5 ఏళ్ళ నుంచి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల వరకు జరిగిన ప్రతీ ఎన్నికలలో నిరూపితమైంది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు ఆయన రచించిన వ్యూహం కూడా ఆయన రాజకీయ చతురతకు నిదర్శనంగా నిలుస్తోంది. దానిలో ప్రధానంగా చెప్పుకోవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. 

1. లోక్‌సభ ఎన్నికలలో 16 సీట్లు తెరాసయే గెలుచుకోబోతోందని గట్టిగా వాదిస్తూ ప్రజలకు కూడా ఆ నమ్మకం కలిగించే ప్రయత్నం చేయడం. 

2. ఆ ప్రయత్నంలో భాగంగానే “కాంగ్రెస్‌, బిజెపిలు మనకు పోటీ కాదు...రాష్ట్రంలో ఎన్నికలు ఏకపక్షమే...కనుక మనలో మనమే మెజార్టీ కోసం పోటీ పడాలి” అంటూ కేటీఆర్‌, హరీష్‌రావులు నేడు సవాళ్ళు విసురుకోవడం.      

3. 16 ఎంపీ సీట్లు గెలుచుకొంటే కేంద్రంలో మన మాటే చెల్లుబాటు అవుతుందనే వాదనతో తెలంగాణ ప్రజలలో మళ్ళీ సెంటిమెంటు రగిల్చి తద్వారా లోక్‌సభ ఎన్నికలలో తెరాసను గెలిపించుకొనే ప్రయత్నం చేయడం.  

4. లోక్‌సభ ఎన్నికల తరువాత ఏ కూటమికి మద్దతు ఇస్తారో చెప్పకుండా తప్పించుకొనేందుకు కాంగ్రెస్‌, బిజెపిలకు సొంతంగా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయలేవంటూ జోస్యం చెపుతుండటం.     

5. బిజెపితో తమకు రహస్య అవగాహన లేదని నొక్కి చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీతో పాటు మోడీ ప్రభుత్వాన్ని కూడా విమర్శిస్తుండటం. 

లోక్‌సభ ఎన్నికల కోసం తెరాస అనుసరిస్తున్న ఈ వ్యూహాలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, హరీష్‌రావు చాలా సమర్ధంగా అమలుచేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌ జోస్యం ఫలించింది కనుక లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆయన చెప్పిందే తప్పక జరుగుతుందని ప్రజలలో నమ్మకం కలిగించేందుకు వారిరువురూ చాలా చక్కగా కృషి చేస్తున్నారు. వారి వాదనలకు ప్రజల నుంచి వస్తున్న మంచి స్పందన చూసినట్లయితే, కేసీఆర్‌ వ్యూహం ఫలిస్తున్నట్లే ఉంది. మరి కాంగ్రెస్‌, బిజెపిలు ఈ వ్యూహాలను ఏవిధంగా ఎదుర్కొంటాయో చూడాలి.


Related Post