పార్టీని మోసం చేయడం తగదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

March 08, 2019


img

నకిరేకల్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య త్వరలో తెరాసలో చేరబోతున్నారని మీడియాలో వస్తున్న ఊహాగానాలపై మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “లింగయ్య గురించి మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అయితే అంత కంటే ఘోరం మరొకటి ఉండదు. ఆయనను మా కుటుంబసభ్యుడిగా భావించి మేము మా అధిష్టానంతో కోట్లాడి అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు టికెట్ ఇప్పించాము.  కానీ గెలిచిన తరువాత తెరాసలో చేరాలనుకొంటే అది ఆదరించిన కాంగ్రెస్ పార్టీని మోసం చేయడమే. ఈవిధంగా చేయడం ఆయనకు తగదు. ఇప్పటికైనా ఆయన అటువంటి ఆలోచన మానుకొని కాంగ్రెస్ పార్టీతో కలిసి సాగాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సమయంలో చిరుమర్తికి టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం వెనుకాడుతుంటే, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే మేమిద్దరం ఎన్నికలలో పోటీ చేయబోమని కోమటిరెడ్డి సోదరులు తమ అధిష్టానాన్ని హెచ్చరించారు. వారిరువురూ పట్టుబట్టి చిరుమర్తికి టికెట్ సాధించుకొన్నారు. అంతే కాదు..ఆయన గెలుపుకోసం కూడా కోమటిరెడ్డి సోదరులు చాలా కృషి చేశారు. కనుక వారికి చిరుమర్తిని నిలదీసి అడిగే హక్కు ఉంది. కోమటిరెడ్డి సోదరుల మాటలు కాస్త కటువుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల వారి విధేయతను రాజగోపాల్ రెడ్డి మాటలు నిరూపిస్తున్నాయి. 

ఏ పార్టీకైనా ఇటువంటి నిజాయితీ కలిగిన నాయకులే అవసరం తప్ప ప్రలోభాలకు లొంగి పార్టీలు మారేవారు కాదు. కనుక ఇకపై ఫిరాయింపులు జరుగకూడదనుకొంటే లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పట్ల విధేయత కలిగిన నేతలకే కాంగ్రెస్‌ టికెట్లు ఇవ్వడం మంచిది. లేకుంటే లోక్‌సభ ఎన్నికలలో అవకాశవాదులు ఎన్ని సీట్లు గెలుచుకొన్నా ప్రయోజనం ఉండదు. వారు కూడా ఏదో ఓ రోజు పార్టీ ఫిరాయించకమానరు.


Related Post