ప్రధాని అభ్యర్ధి ఎవరో కేసీఆర్‌ చెప్పగలరా? కిషన్ రెడ్డి

March 08, 2019


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నందున రాజకీయ నేతలు పరస్పరం విమర్శలు చేసుకొంటుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మళ్ళీ వేడెక్కుతోంది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలలో కాంగ్రెస్‌, బిజెపిలకు ఓట్లు వేసి గెలిపిస్తే డిల్లీకి గులాములవుతామని కనుక తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇచ్చి కేంద్రం మెడలు వంచి అన్ని సాధించుకొందామని గట్టిగా నొక్కి చెపుతున్నారు. ఆయన వాదనపై బిజెపి నేత కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

గురువారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపిస్తే సోనియా, రాహుల్ గాంధీలకు, తెరాసను గెలిపిస్తే ఎంపీలు కేసీఆర్‌ కుటుంబానికి గులామీ చేస్తారు తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేరు. అదే... బిజెపిని గెలిపిస్తే కేంద్రంలో బలమైన, సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. దేశాభివృద్ధి జరుగుతుంది. మనకు నరేంద్రమోడీ వంటి బలమైన ప్రధాని ఉన్నారు కనుకనే పాకిస్థాన్‌కు పట్టిన దయ్యాన్ని వదిలించగలిగారు. ఈ పరిస్థితులలో మనకు మోడీ వంటి సమర్ధమైన నాయకుడు కావాలి కానీ కుటుంబపాలన కాదు. కనుక దేశానికి సేవ చేసేవారిని ఎన్నుకోవాలో లేక కుటుంబాలకు బానిసలను ఎన్నుకోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. 16 ఎంపీ సీట్లు ఇస్తే ప్రధాని అభ్యర్ధిని తానే నిర్ణయిస్తానని చెప్పుకొంటున్న సిఎం కేసీఆర్‌కు ప్రధాని అభ్యర్ధిని ప్రకటించే ధైర్యం ఉందా?

రాష్ట్రంలో బిజెపి అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్ధుల చొప్పున జాబితాలను తయారు చేసి పంపించవలసిందిగా మా పార్టీ అధిష్టానం కోరింది. త్వరలోనే మా పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తాము,” అని చెప్పారు.


Related Post