హోదా అడిగితే ముసిముసినవ్వులా? కేటీఆర్‌

March 07, 2019


img

 ఈరోజు భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం సన్నాహక సభలో పాల్గొన్న తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు 16 ఎంపీ సీట్లు గెలుచుకోవాల్సిన అవసరాన్ని తెరాస శ్రేణులకు చక్కగా వివరించారు. వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలలో భారీ మెజార్టీతో, కొన్నిటిలో స్వల్ప మెజార్టీతో గెలిచాము. మరికొన్ని నియోజకవర్గాలలో ఓటమి పాలయ్యాము. ప్రజాతీర్పులో ఇంత తేడా ఎందుకు వచ్చిందని మనం ఆత్మవిమర్శ చేసుకొని లోపాలను సవరించుకొని లోక్‌సభ ఎన్నికలకు సిద్దం కావలసి ఉంది. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ నేల విడిచి సాము చేయకుండా పక్కా ప్రణాళికలతో లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంటుంది.   

కేసీఆర్‌ నేతృత్వంలో మన రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కానీ పెత్తనం కేంద్రం చేతిలో ఉన్నందున రాష్ట్రానికి రావలసినవన్నీ సాధించుకోలేకపోయాము. ఉదాహరణకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వమని ప్రధాని నరేంద్రమోడీని కోరితే ఆయన మూసిముసి నవ్వులు నవ్వుతారు తప్ప జవాబు ఇవ్వరు. అదే ‘కేంద్రం రిమోట్’ మన చేతిలోనే ఉన్నట్లయితే ఇటువంటివన్నీ సులువుగా సాధించుకోవచ్చు.

కర్ర ఉన్నవాడిదే బర్రె అన్నట్లున్నాయి నేడు దేశంలో రాజకీయ పరిస్థితులు. ఉదాహరణకు లాలూ ప్రసాద్ రైల్వే మంత్రి అయినప్పుడు రైల్వే ప్రాజెక్టులన్నీ బీహార్ వెళ్లిపోయాయి. తృణమూల్ నేత రైల్వేమంత్రి అయితే ప్రాజెక్టులు పశ్చిమబెంగాల్ వెళ్లిపోయాయి. మన రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రావాలంటే మన చేతిలో 16 ఎంపీ సీట్లు ఉండాలి. అప్పుడే కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా మన మాట చెల్లుబాటు అవుతుంది. మన రాష్ట్రానికి కావలసినవన్నీ సాధించుకోవచ్చు,” అని చెప్పారు. 


Related Post