తెలంగాణ ఏర్పడినా దోపిడీ కొనసాగుతూనే ఉందా?

July 19, 2016


img

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకి మధ్య చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది. కెసిఆర్ కుటుంబ సభ్యుల జేబులు నింపుకోవడానికే, ప్రాజెక్టుల డిజైన్లలో మార్పులు చేశారని, ఆ ప్రాజెక్టుల వలన వారికీ, తెరాస నేతలకి, ఆంధ్రా కాంట్రాక్టర్లకి మాత్రమే ప్రయోజనం కలుగుతుంది తప్ప ప్రజలకి కలగదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి.

మల్లన్నసాగర్ రిజర్వాయర్ విషయంలోనూ ప్రస్తుతం చాలా రభస జరుగుతోంది. దాని క్రింద ముంపుకి గురయ్యే గ్రామాలలో నివసిస్తున్న ప్రజలకి న్యాయం జరిగేవరకు ఆ ప్రాజెక్టుని అడ్డుకొంటామని ప్రతిపక్షాలే కాకుండా తెలంగాణ రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే మరో అడుగు ముందుకేసి అసలు మల్లన్నసాగర్ జలాశయం నిర్మించనవసరమే లేదని వాదిస్తోంది. మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతలు, కొందరు సాగునీటి నిపుణులు కలిసి ఇటీవల హర్యానాలో పర్యటించి అక్కడ ఎటువంటి జలాశయాలు లేకుండా సుమారు 4 లక్షల ఎకరాలకి నిరంతరం నీళ్ళు అందిస్తున్న జవహార్ లాల్ నెహ్రు ఎత్తిపోతల పధకాన్ని అధ్యయనం చేసి వచ్చారు. అదే విషయాన్ని వారు మల్లన్నసాగర్ నిర్వాసితులకి కూడా వివరించడంతో వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, కోదండ రెడ్డి కలిసి నిన్న హైదరాబాద్ లోని గాంధీ భవన్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి, తెలంగాణ ప్రభుత్వంపై తమ ఆరోపణలని పునరుద్ఘాటించారు. ఒకప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్రంలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుల గురించి శాసనసభ్యులకి వివరిస్తే, కాంగ్రెస్ నేతలు కూడా నిన్న పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారానే వాటిలో ఉన్న లోపాలని ఎత్తి చూపుతూ, ఎక్కడెక్కడ ఏ మేరకు అవినీతి జరుగుతోందో మీడియా ప్రతినిధులకి వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టుల గురించి ఎటువంటి అంచనాలు, సమగ్ర నివేదికలు, నిర్వాసితులపై వాటి ప్రభావం గురించి ఎటువంటి శాస్త్రీయ అధ్యయనాలు చేయకుండానే పనులు మొదలు పెట్టేసి వేలకోట్ల ప్రజాధనం తన ఇష్టం వచ్చినట్లు ఖర్చుచేసేస్తోందని ఆరోపించారు. ఈనెల 23న ఆ ప్రాజెక్టుల వలన నిర్వాసితులవుతున్న ప్రజల వద్దకి వెళ్లి వారికి కూడా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పులు, ప్రాజెక్టులో లోపాలు, జరుగుతున్న అవినీతి గురించి వివరిస్తామని వారు చెప్పారు. 

ఆంధ్రా పాలకులు ఒకప్పుడు తెలంగాణకి చాలా అన్యాయం చేశారని తెరాస నేతలు తరచూ ఆరోపిస్తుంటారు. ఇప్పుడు తెరాస ప్రభుత్వమే తెలంగాణ ప్రజలకి అన్యాయం చేసి దోచుకొంటోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. రాష్ట్రం విడిపోయి టిఆర్ఎస్  ప్రభుత్వం ఏర్పడిన తరువాత కూడా రాష్ట్రంలో ఇటువంటి వివాదాలు ఏర్పడుతుండటం చూసి తెలంగాణ ప్రజలు చాలా కలత చెందుతున్నారు. అధికార ప్రతిపక్షాలలో ఎవరి వాదన సరైనదో తెలియాలంటే మళ్ళీ తెలంగాణ  మేధావులే రంగంలో దిగి వాస్తవాలు వెలికితీసి ప్రజలకి వివరించడం చాలా అవసరం. 


Related Post