ప్రత్యక్ష యుద్ధమా...సర్జికల్ స్ట్రైక్సా?

February 20, 2019


img

పుల్వామా ఉగ్రదాడి తరువాత భారతీయులలో మళ్ళీ తీవ్ర ఆగ్రహావేశాలు ప్రకోపిస్తున్నాయి. వెంటనే పాకిస్థాన్‌పై యుద్దం ప్రకటించాలని, ఇదివరకులాగ సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. అటువంటి చర్యలకు దిగితే ఎటువంటి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయో ప్రజలకు వివరించి చెప్పాల్సిన మీడియా ప్రజల ఆవేశాన్ని మరింత పెంచిపోషిస్తోంది. భారత్-పాకిస్థాన్‌ దేశాల బలాబాలాలు ఏవిధంగా ఉన్నాయో వివరిస్తూ కధనాలు ప్రచురిస్తున్నాయి. పాకిస్థాన్‌ కంటే భారత్‌కే ఎక్కువ సైన్యం, ఆయుధ సంపత్తి, యుద్ధవిమానాలు, ట్యాంకర్లు ఉన్నాయని చెపుతూ ‘పాకిస్థాన్‌పై యుద్ధం చేసి గెలవడం చాలా సులువే’ అనే భావన ప్రజలకు కలిగిస్తున్నాయి. 

పాకిస్థాన్‌ కంటే భారత్‌ సైనిక సంపత్తే ఎక్కువ ఉండవచ్చు. కానీ ప్రత్యక్షయుద్దానికి దిగితే, పాకిస్థాన్‌కు చైనా, సౌదీ అరేబియా తదితర దేశాలు తప్పక సహకరిస్తాయి. అదేవిధంగా భారత్‌కు కూడా కొన్ని దేశాలు సహకరించవచ్చు. ఇరువైపులా కొన్ని దేశాలు నిలిచి యుద్ధం ప్రారంభిస్తే ప్రాణనష్టం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. 

ఈ రోజుల్లో చీమ చిటుకుమన్నా కనిపెట్టగల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. కనుక భారతసేనలు సరిహద్దులవైపు కదిలితే ఆ విషయం పాకిస్థాన్‌కు క్షణాలలో తెలిసిపోతుంది. కనుక అది కూడా అంతే వేగంగా సైన్యాన్ని సిద్దం చేస్తుంది. కనుక పాకిస్థాన్‌కు తెలియకుండా ఆకస్మిక దాడి చేయడం అసంభవం. 

ఒకవేళ ఇతర దేశాలు భారత్-పాక్ లకు దూరంగా ఉన్నా భారత్ దాడి మొదలుపెట్టగానే పాకిస్థాన్‌ క్షణం ఆలోచించకుండా భారత్‌పై అణుబాంబులు ప్రయోగించడానికి వెనుకాడదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఒకవేళ పాక్ ప్రభుత్వం వెనుకంజ వేసినా పాక్ ఆర్మీ, ఉగ్రవాదులు ఊరుకోరు. వారు అణ్వాయుధాలను తమ చేతిలోకి తీసుకొని భారత్‌పై ప్రయోగిస్తారు. కనుక ప్రత్యక్షయుద్ధానికి దిగితే భారత్‌ కూడా చాలా భారీ మూల్యం చెల్లించక తప్పదు. 

గతంలో పాక్ భూభాగంలో భారత సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేసి ఉన్నందున, ఈసారి పాకిస్థాన్‌ కూడా అందుకు సన్నద్ధంగానే ఉంటుంది. కనుక భారత్ మళ్ళీ అటువంటి ప్రయత్నం చేసినట్లయితే ఈసారి తప్పక ఎదురుదాడి చేస్తుంది. కనుక పాక్ అప్రమత్తంగా ఉన్న ఈ సమయంలో సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఆత్మహత్యతో సమానమే. 

ఇక యుద్ధవిమానాలతో దాడికి ప్రయత్నించినా ఎదుర్కొనేందుకు పాకిస్థాన్‌ వాయుసేన సిద్దంగానే ఉంటుంది. పైగా పాకిస్థాన్‌ కూడా భారత్‌లో కొన్ని ప్రధాన నగరాలపై దాడులకు ప్రయత్నించవచ్చు. కనుక గగనతల యుద్ధం కూడా చాలా ఆలోచించి చేయవలసినదే. 

ఇక భారత్-పాక్ దేశాల మద్య ఏ స్థాయిలో ఎటువంటి యుద్ధం జరిగినా దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్‌ సానుభూతిపరులు, ఉగ్రవాద సానుభూతిపరులు, వారి స్లీపర్ సెల్స్ అంతర్గతంగా పెను విద్వంసం సృష్టించవచ్చు. కనుక భారత్ ఒకేసమయంలో ఇంటా, బయటా శత్రువులతో యుద్ధం చేసి గెలవవలసి ఉంటుంది. ఈ తీవ్ర పర్యవసనాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని  చాలా ఆలోచించి భారత్‌ అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది.

కనుక పాకిస్థాన్‌కు సైనికపరంగా ఏవిధంగా బుద్ధి చెప్పవచ్చనేది కేవలం యుద్ధనిపుణులు మాత్రమే చెప్పగలరు మీడియా కాదు. కనుక మీడియా సృష్టిస్తున్న ‘యుద్ధ హైప్’ కు సామాన్యప్రజలు దూరంగా ఉండటమే మంచిది. 


Related Post