రేవంత్‌ రెడ్డి విచారణ కక్ష సాధింపు చర్యలా?

February 20, 2019


img

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు నేడు వరుసగా రెండవరోజు కూడా ప్రశ్నిస్తున్నారు. సాక్ష్యాధారాలతో సహా అన్ని ఎదురుగా పెట్టి మరీ ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు రేవంత్‌ రెడ్డి ఏవిధంగా సమాధానాలు చెపుతున్నారనే విషయం పక్కన పెడితే, నిన్న విచారణ ముగిసిన తరువాత మీడియాతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ అవినీతిని నేను ప్రశ్నిస్తున్నందునే రాజకీయ కక్ష సాధింపు చర్యలలో భాగంగా కేసీఆర్‌-మోడీ కలిసి నన్ను ఈవిధంగా వేదిస్తున్నారు. కానీ తల తెగిపడినా కేసీఆర్‌ అవినీతి గురించి ప్రశ్నిస్తూనే ఉంటాను,” అని అన్నారు. 

ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డి ఏవిదంగా చిక్కుకొన్నారో అందరికీ తెలుసు. వాటన్నిటికీ ఆడియో, వీడియోల సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ ఆ కేసులో తనను కేసీఆర్‌ అక్రమంగా ఇరికించారని, ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించడం హాస్యాస్పదంగా ఉంది. 

దేశంలో దాదాపు అన్ని పార్టీలు, వాటి నేతలు ఇటువంటి అవినీతి పనులు చేస్తూనే ఉంటారు. కానీ దొరికితేనే దొంగ లేకుంటే దొరలుగా చలామణి అవుతారు. ఈ కేసులో రేవంత్‌ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. మన దేశంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులు అధికార పార్టీలో ఉన్నట్లయితే వారిపై ఎటువంటి కేసులు, విచారణలు ఉండవు జరుగవు. కనుక అధికారం వారికి రక్షణ కవచంగా నిలుస్తుంది. 

అదే..ప్రతిపక్షంలో ఉన్నట్లయితే అవినీతికి పాల్పడినప్పటికీ వారిపై విచారణ జరిపినా, జైలుకు పంపినా అది రాజకీయ కక్ష సాధింపే అనే వాదనతో తమను తాము సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి కూడా అదే చేస్తున్నారనుకోవచ్చు. కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నట్లయితే రేవంత్‌ రెడ్డి తప్పక ప్రశ్నించవచ్చు కానీ అంతకంటే ముందుగా ఈ కేసులో తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకోవలసి ఉంది. అందుకు న్యాయస్థానాలు ఉండనే ఉన్నాయి కదా.


Related Post