మోడీ నా పెద్దన్నవంటివారు: సౌదీ యువరాజు

February 20, 2019


img

పుల్వామా దాడి తరువాత భారత్-పాక్ మద్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనున్న సమయంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పాకిస్థాన్‌లో పర్యటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో సమావేశమైనప్పుడు ‘పాకిస్థాన్‌ మాకు అత్యంత సన్నిహిత స్నేహదేశంగా భావిస్తున్నాము. పాకిస్థాన్‌కు ఎల్లప్పుడూ అండగా నిలబడతాము,” అని హామీ ఇచ్చారు. 

పాకిస్థాన్‌ పర్యటన తరువాత ఆయన భారత్ రావలసి ఉండగా దౌత్యకారణాల చేత వీలుపడకపోవడంతో మళ్ళీ సౌదీ అరేబియాకు వెళ్ళిపోయి బుదవారం ఉదయం డిల్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు ఎదురేగి స్వాగతం పలికారు. 

దేశాధినేతలు విదేశీపర్యటనలో ఉన్నప్పుడూ ఒప్పందాలు కుదుర్చుచుకోవడం ఇటువంటి పడికట్టు వాఖ్యాలు వల్లించడం సాధారణమైన విషయమే. పాకిస్థాన్‌ గడ్డపై నిలబడి ఆ దేశాన్ని తప్పు పట్టడం చాలా ఇబ్బందికరమే కనుక సౌదీ యువరాజు పుల్వామా దాడిని ఖండించే ప్రయత్నం చేయలేదని సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు భారత్ గడ్డపై ఉన్నారు కనుక పాక్ ప్రేరిత ఉగ్రదాడిని ఖండించవచ్చు. పాకిస్థాన్‌ వైఖరి మార్చుకోవలసిన అవసరం ఉందని నొక్కి చెప్పవచ్చు. కానీ ఇప్పటికీ పుల్వామా దాడిని ఖండించలేదు. ‘భారత ప్రధాని నరేంద్రమోడీ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన నాకు పెద్దన్నవంటివారు. లక్షల మంది భారతీయులు దశాబ్ధాలపాటు మాదేశాభివృద్ధి కోసం రేయింబవళ్లు పనిచేశారు. అందుకే భారత్ పట్ల నాకు చాలా ప్రేమాభిమానాలు ఉన్నాయి,” అని పొగడ్తలతో సరిపెట్టారు. 

అనంతరం మోడీ-బిన్ సల్మాన్ సంయుక్త ప్రకటనలో “ఉగ్రవాదం ఇప్పుడు అందరి సమస్యగా మారింది. దానిని అరికట్టేందుకు భారత్ తో సహా మా ఇరుగుపొరుగుదేశాలన్నిటికీ అవసరమైన సహాయసహకారాలు అందిస్తాము,” అని బిన్ సల్మాన్ అన్నారు.  

ఉగ్రవాదులకు అడ్డాగా మారిన పాకిస్థాన్‌కు అండగా నిలబడతామని చెప్పిన తరువాత ఆయన ఇప్పుడు పుల్వామా దాడిని ఖండిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది. ఒకవేళ ఖండించినా అది కేవలం భారత్ మెప్పు కోసమేననుకోవచ్చు. తాము పాకిస్థాన్‌వైపే ఉంటామని స్పష్టంగా చెప్పిన తరువాత ఇక ఈవిషయంలో సౌదీ అరేబియా నుంచి భారత్ ఏమీ ఆశించనవసరం లేదు. 


Related Post