యుద్ధం మొదలైతే ఆపడం కష్టం: పాక్ ప్రధాని

February 19, 2019


img

పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకొంటామని ప్రధాని నరేంద్రమోడీ పదేపదే హెచ్చరిస్తుండటంతో, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ శైలిలోనే స్పందించారు. ఈరోజు ఆయన ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పుల్వామా దాడికి పాకిస్థాన్‌ను నిందించడం సరికాదు. ఆ ఉగ్రవాద దాడితో మా దేశానికి సంబందాలు ఉన్నాయంటూ భారత్ ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ఆరోపణలను మేము ఖండిస్తున్నాము. ఆ దాడితో మా దేశానికి ఎటువంటి సంబందమూ లేదు. అయినా ఆవిధంగా దాడి చేయడం వలన మా దేశానికి ఏమి ప్రయోజనం ఉంటుంది? ఒకవేళ పాక్ ప్రమేయం ఉందని భారత్ భావిస్తున్నట్లయితే విచారణకు మేము పూర్తిగా సహకరిస్తాము. అందుకు నేను హామీ ఇస్తున్నాను. నిజానికి పాకిస్థాన్‌ కూడా ఉగ్రవాదబాధిత దేశమే. ఉగ్రవాదుల దాడిలో అనేకమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడికి ప్రతీకారచర్యలుంటాయని భారత్ హెచ్చరించడం కూడా సరికాదు. మాపై దాడి చేస్తే మేము చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోము. తప్పక ప్రతిఘటిస్తాము. యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లోనే ఉంటుంది కానీ దానికి ముగింపు ఎవారి చేతుల్లోనూ ఉండదని గుర్తుంచుకోవాలి. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు కనుక శాంతియుత చర్చలతోనే పరిష్కరించుకోవడం ఉత్తమం,” అని అన్నారు. 

పుల్వామా దాడి జరిగిన కొద్ది నిమిషాలకే పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న జైష్-ఏ-మహమ్మద్ సంస్థ అది తమ పనే అని గొప్పగా చాటుకొంది. ఇంత ఖచ్చితమైన ఆధారం కళ్ళ ముందు కనిపిస్తుంటే, ఇంకా ఆధారాలు చూపాలని పాక్ ప్రధాని వాదించడం విడ్డూరంగా ఉంది. నిజానికి భారత్ పై ఉగ్రదాడులు జరిగిన ప్రతీసారి పాక్ ఇదేవిధంగా వాదిస్తూ తప్పించుకొంటోంది. పాకిస్థాన్‌ ఇంత ధైర్యంగా వాదించడానికి చాలా బలమైన కారణమే ఉంది. ఒకవేళ పాకిస్థాన్‌తో భారత్   ప్రత్యక్షయుద్ధానికి దిగితే ఆ దేశం కంటే అన్నివిధాల అభివృద్ధి చెందిన భారత్ ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఒకే ఒక్క యుద్ధంతో ఏడు దశాబ్ధాలలో సాధించిన అభివృద్ధి తుడిచిపెట్టుకు పోయీ భారత్ పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. కనుకనే భారత్ వెనుకంజవేస్తోందని చెప్పవచ్చు. భారత్ యొక్క ఈ బలహీనతే పాకిస్థాన్‌ను వినాశనం కాకుండా కాపాడుతోందని చెప్పవచ్చు. ఆ సంగతి పాక్ కూడా బాగానే గ్రహించింది కనుకనే ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతోంది. కనుక పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పించడానికి భారత్ ఏదైనా సరికొత్త మార్గాన్ని కనుగొనవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పాక్ చెపుతున్నట్లుగా యుద్ధంతో ఈ సమస్య పరిష్కారం కాదు. శాంతి చర్చలతో అసలే కాదు కనుక.


Related Post