అసంతృప్తి లేదు: హరీష్‌రావు

February 19, 2019


img

తెరాసలో అత్యంత సీనియర్ నేతలలో ఒకరైన హరీష్‌రావు గత ప్రభుత్వం సాగునీటిశాఖా మంత్రిగా పలు ప్రాజెక్టులను పరుగులు పెట్టించి శరవేగంగా పనులు పూర్తి చేయించి అందరి మన్ననలు అందుకొన్నారు. కనుక మళ్ళీ ఆయనకు అదే శాఖను లేదా దానితోపాటు మరికొన్ని శాఖలను సిఎం కేసీఆర్‌ అప్పగిస్తారని భావించడం సహజం. కానీ ఈరోజు జరిగిన తొలి మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పించలేదు. 

ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాలుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ హరీష్‌రావు మాత్రం వాటిని కొట్టిపడేశారు. ఈరోజు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం చేసిన తరువాత మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “నేను అసంతృప్తిగా ఉన్నానని సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలలో నిజం లేదు. పార్టీలో నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా, పార్టీ అధిష్టానం నాకు అప్పగించిన పనిని చేసుకుపోతుంటాను. వివిద ప్రాంతాలు, వర్గాల సమీకరణలను బట్టి మంత్రి పదవులు కేటాయింపులు జరుగుతుంటాయి. కనుక నాకు మంత్రిపదవి రానందుకు నేను బాధపడటం లేదు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు అందరికీ నా శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా అందరూ కష్టపడి పనిచేయాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

రాజకీయ పార్టీల అంతిమ లక్ష్యం అధికారం చేపట్టడమైతే...రాజకీయ నాయకుల లక్ష్యం మంత్రి పదవులు సంపాదించడమేనాని అందరికీ తెలుసు. అందుకే ఏ ప్రభుత్వంలోనైనా మంత్రిపదవులకు అనేకమంది పోటీ పడుతుంటారు. కనుక ‘మంత్రిపదవి లభించకపోయినా తృప్తిగానే ఉంటాను...క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేస్తాను’ వంటి రొటీన్ డైలాగులు కేవలం మీడియా కోసం చెప్పేవేనని భావించవచ్చు. 

హరీష్‌రావు సమర్దత, విధేయత, నాయకత్వ లక్షణాలు, సమస్యలను పరిష్కరించడంలో చూపే నేర్పు గురించి అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తికి మంత్రిపదవి లభించలేదంటే ఏదో బలమైన కారణమే ఉండాలి. ఆ విషయం హరీష్‌రావుకు తెలియదనుకోలేము. అందుకే తొందరపడి అసంతృప్తి వ్యక్తం చేయలేదు. 

లోక్‌సభ ఎన్నికలలో హరీష్‌రావు పోటీ చేయబోతున్నారని, ఆయన ఖాళీ చేసిన స్థానంలో ఆయన భార్య శాసనసభ ఉపఎన్నికలలో పోటీ చేస్తారని కొద్ది రోజుల క్రితమే ఆయన సమీప బందువు రమ్యారావు ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల తరువాత సిఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలోకి వెళ్ళబోతున్నారు కనుక తనతోపాటు హరీష్‌రావు, కడియం వంటి సీనియర్లను లోక్‌సభకు వెంటబెట్టుకుపోవాలని యోచిస్తున్నారేమో? అందుకే హరీష్‌రావుకు ఏ బాధ్యతలు అప్పగించలేదేమో? ఏమో?


Related Post