అందుకే హరీష్‌రావుకు మంత్రిపదవి లభించదు: రేవంత్‌ రెడ్డి

February 19, 2019


img

కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన తరువాత రెండేళ్ళ వరకు మీడియాతో మాట్లాడబోనని చెప్పారు. కానీ రెండు నెలలు తిరక్కముందే మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఈసారి మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావును లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేశారు. 

సోమవారం హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, “హరీష్‌రావు మంత్రిగా ఉన్నప్పుడు మిడ్ మానేరు, గౌరల్లీ, తోటపల్లి పనులకు టెండర్లు పిలువకుండా తన బినామీలకు కట్టబెట్టి సుమారు రూ.1,000 కోట్లు వెనకేసుకొన్నారు. ఆ డబ్బునే సిఎం కేసీఆర్‌కు తెలియకుండా ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులపై ఖర్చు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలలో హరీష్‌రావు ఒక్కరే 26 మంది అభ్యర్ధులకు డబ్బులు పంచారు. కొందరు కాంగ్రెస్‌ నేతలకు కూడా ఆయన ఆఫర్ చేశారు. ఇక ఈసారి హరీష్‌రావుకు మంత్రివర్గంలో తీసుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయన సిఎం కేసీఆర్‌కు తెలియకుండా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఫోన్లో మాట్లాడారు. కానీ ఆ విషయం ఎలాగో కేసీఆర్‌కు తెలిసిపోయింది. అందుకే ఈసారి హరీష్‌రావుకు మంత్రిపదవి లభించకపోవచ్చు. ఒకవేళ హరీష్‌రావు ఎదురుతిరిగితే పాస్‌పోర్టు కేసులో ఇరికించడానికి కూడా సిఎం కేసీఆర్‌ వెనుకాడకపోవచ్చు. వరుసగా రెండవసారి గెలవడంతో సిఎం కేసీఆర్‌ పార్టీలో ఎవరినీ లెక్కచేయడంలేదు. నాయిని, కడియం, హరీష్ వంటి సీనియర్లందరినీ పక్కనపెట్టేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి తల్లి చనిపోతే ఆయనను పరామర్శించడానికి వెళ్ళిన సిఎం కేసీఆర్‌కు అమరజవానుల కుటుంబాలను పలకరించడానికి తీరిక, ఆసక్తి లేవు. నిజామాబాద్‌లో పసుపు, ఎర్రజొన్న రైతులు గత రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నా కేసీఆర్‌ పట్టించుకోలేదు. వారంలోగా వారి సమస్యను పరిష్కరించకుంటే నేను వెళ్ళి వారి తరపున పోరాడుతాను,” అని రేవంత్‌ రెడ్డి అన్నారు.


Related Post