పోటీ మోడీ-రాహుల్ మద్యనే ఉంటుందా?

February 12, 2019


img

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే దేశవ్యాప్తంగా పంటరుణాలను మాఫీ చేస్తామని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు ప్రధాని నరేంద్రమోడీకి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మద్య జరుగబోతున్న ఎన్నికలని అన్నారు. మోడీ ప్రభుత్వం హామీల అమలులో వైఫల్యం చెందడమేకాక దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని, ముఖ్యంగా మైనార్టీ వర్గాల ప్రజలలో తీవ్ర అభద్రతాభావం కల్పించిందని అన్నారు. కనుక లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని దాని మిత్రపక్షాలను ఓడించి, కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకురావలసిన అవసరం చాలా ఉందని అన్నారు. అందుకోసం రాష్ట్రంలో పార్టీ నేతలు, కార్యకర్తలు మరింత కష్టపడి పని చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని, ఆలోగానే కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్ధుల పేర్లను కూడ ఖరారు చేస్తామని చెప్పారు. 

జాతీయ స్థాయిలో చూసినట్లయితే ఈ ఎన్నికలు కాంగ్రెస్‌-బిజెపిల మద్య జరుగుతున్నవిగానే కనిపిస్తాయి. కానీ రాష్ట్ర స్థాయిలో చూసినట్లయితే, అనేక రాష్ట్రాలలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో ఆ రెండు పార్టీల కంటే ప్రాంతీయ పార్టీలే చాలా బలంగా ఉన్నాయి. కనుక వాటి మద్యే పోటీ ప్రధానంగా ఉండబోతోంది. ఉదాహరణకు తెలంగాణలో కాంగ్రెస్‌, బిజెపిలకంటే తెరాస బలంగా ఉంది. కనుక దానితో ఆ రెండు పార్టీలు పోటీ పడవలసి ఉంటుంది. ఏపీలో కాంగ్రెస్‌, బిజెపిలు ఉన్నప్పటికీ పోటీ ప్రధానంగా టిడిపి, వైకాపాల మద్యనే ఉంటుందని అందరికీ తెలుసు. తమిళనాడులో కూడా అదే పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్‌, బిజెపిలు బలంగా ఉన్నందున వాటి మద్యే పోటీ ఉండవచ్చు. కేరళలో బిజెపి అడుగుపెట్టలేని స్థితిలో ఉంది. ఉత్తరాది రాష్ట్రాలలో యూపీలో సమాజ్‌వాదీ, బీఎస్పీలు కాంగ్రెస్‌, బిజెపిలకు గట్టిపోటీ నివ్వబోతున్నాయి. 

ఈవిధంగా అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలదే హవా నడుస్తున్నప్పుడు, మోడీ-రాహుల్ మద్య పోటీ అనుకోవడం ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలకు పూర్తి మెజారిటీ రాకపోవచ్చునని, అధికారం చేజిక్కించుకోవడానికి ప్రాంతీయపార్టీల మద్దతు తప్పనిసరి అని సర్వేలు జోస్యం చెపుతున్నాయి. కనుకనే కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలను కూడగట్టడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రభావం లోక్‌సభ ఎన్నికలపై కూడా పడే అవకాశం ఉంది కనుక దానిని అధిగమించి విజయం సాధించడానికి రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల వద్ద బలమైన వ్యూహాలు ఏమైనా ఉన్నాయో లేదో?ఆలోచించుకొంటే మంచిది.


Related Post