సింగరేణిలో మహిళ కార్మికులకు ఉద్యోగావకాశాలు

February 12, 2019


img

భూగర్భ బొగ్గు గనులలో మహిళా కార్మికులు పనిచేయడానికి వీలుకల్పిస్తూ కేంద్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో సింగరేణిలో కూడా మహిళా కార్మికులకు ఉద్యోగావకాశాలు లభించబోతున్నాయి. భూగర్భ గనులలో బొగ్గును వెలికితీసే కోల్ కట్టర్ ఉద్యోగాలతో పాటు కన్వేయర్ ఆపరేటర్స్, పంప్‌ ఆపరేటర్స్, ఫిట్టర్, జనరల్ మజ్దూర్, హెల్పర్స్ వంటి 52 రకాల పోస్టులలో మహిళలను తీసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. వాటిలో సుమారు 600 పోస్టులను మహిళలతో భర్తీ చేసేందుకు సింగరేణి యాజమాన్యం కసరత్తు ప్రారంభించింది. 

మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయంతో సింగరేణిలో అమలవుతున్న వారసత్వ ఉద్యోగాలకు కూడా మహిళలు అర్హత పొందారు. కనుక ఆ విధంగా కూడా కొంతమంది మహిళలకు సింగరేణిలో ఉద్యోగాలు లభించనున్నాయి. 

భూగర్భగనులలో పనిచేసే మహిళల భద్రత కోసం కేంద్రప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. భూగర్భ గనులలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు, అదే ఓపెన్ కాస్ట్ గనులలోనైతే మూడు షిఫ్టులలో పనిచేసేందుకు మహిళా కార్మికులకు వీలు కల్పించింది. భూగర్భ గనులలో కనీసం ముగ్గురు మహిళా కార్మికులు ఒకే చోట పనిచేసేవిధంగా పని షెడ్యూల్ రూపొందించుకోవలసి ఉంటుంది. మహిళా కార్మికుల భద్రత, రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, దానికి పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యం తీసుకోవలసి ఉంటుందని సూచించింది.     Related Post