టికెట్ల కోసం కాంగ్రెస్‌లో ఎప్పుడూ పోటీయే

February 12, 2019


img

కాంగ్రెస్ పార్టీ జయాపజయాలతో సంబందంలేని పార్టీ అని చెప్పవచ్చు. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలొచ్చేసరికి మళ్ళీ యధాప్రకారం ఆ పార్టీలో టికెట్ల కోసం పోటీ మొదలైపోయింది. అంటే పార్టీలో నేతలకు తమ పార్టీపై నమ్మకం చెక్కుచెదరలేదని స్పష్టం అవుతోంది. టికెట్ లభిస్తే చాలు...సగం విజయం సాధించినట్లేనని భావిస్తున్నవారు పార్టీలో చాలా మందే ఉన్నారు. 

అందుకే లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయదలచుకున్నవారితో గాంధీభవన్‌ మళ్ళీ కిటకిటలాడుతోంది. మొన్న ఆదివారం నుంచి 3 రోజులపాటు అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించడంతో మొదటి రోజున 30 మంది, రెండవ రోజున 100కు పైగా దరఖాస్తులు అందాయి. వారిలో కొంతమంది రెండు నియోజకవర్గాలలో దరఖాస్తు చేసుకొన్నారు. 

రాష్ట్రంలో కేవలం 17 ఎంపీ (లోక్‌సభ) సీట్లు మాత్రమే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీలో మొదటి రెండురోజులలోనే 130 మందికి పైగా అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడం విశేషం. చివరి రోజైన ఈరోజు కూడా అనేకమంది దరఖాస్తులు సమర్పిస్తునే ఉన్నారు. 

నిన్న (సోమవారం) దరఖాస్తు చేసుకొన్నవారిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జి. వెంకట్ నారాయణ్ గౌడ్ (నల్గొండ), పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఖమ్మం), అంజన్ కుమార్ యాదవ్, ఇందిరా శోభన్ (సికిందరాబాద్), మానవతారాయ్, అద్దంకి దయాకర్, దొమ్మాటి సాంబయ్య (వరంగల్), అద్దంకి దయాకర్ (పెదపల్లి), సత్యం శ్రీరంగం (మల్కాజ్‌గిరి), రేగులపాటి రంయారావు, నేరెళ్ళ శారద (కరీంనగర్‌), కొమ్మూరి ప్రతాప్ రెడ్డి (భువనగిరి), మానవతా రాయ్, మల్లు రమేశ్, బొల్లు కిషన్ (నాగర్ కర్నూల్), సూర్యానాయక్, ప్రొఫెసర్ బి రమేశ్ నాయక్ (మహబూబాబాద్) తదితర ప్రముఖులు ఉన్నారు. 

అభ్యర్ధులు తమ అనుచరులను వెంటబెట్టుకొని గాంధీభవన్‌కు వచ్చి రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా లేదా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, గాంధీభవన్‌ ఇన్-ఛార్జ్ కుమార్ రావులలో ఎవరో ఒకరికి దరఖాస్తులు అందజేస్తున్నారు. కానీ, ఈసారి కూడా యధాప్రకారం సీనియర్లకు మళ్ళీ టికెట్లు కేటాయించే అవకాశాలే ఎక్కువ. 


Related Post