వెన్నుపోటు కారణంగానే ఓటమి: తుమ్మల

February 12, 2019


img

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో తెరాస మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం సోమవారం పెద్దతండాలోని మల్లారెడ్డి ఫంక్షన్ హాలులో జరిగింది. ఆ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్త సర్పంచ్‌లకు శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికలలో తన ఓటమి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “నియోజకవర్గం సొంతపార్టీలోనే కొందరు వెన్నుపోటు పొడవడంతో ఓడిపోయాను. అందరూ చేతులు కలిపి నన్ను ఓడించి రాక్షసానందంపొందారు. అయితే కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేసినవారు ఎన్నడూ రాజకీయాలలో రాణించలేరని వారు గ్రహిస్తే మంచిది. అసెంబ్లీ ఎన్నికలలో నేను ఓడిపోయినప్పటికీ, పంచాయతీ ఎన్నికలలో తెరాస మద్దతుదారులను గెలిపించుకోగలిగాము. ఎన్నికలు పూర్తయ్యాయి కనుక విద్వేషాలు మరిచి అందరూ కలిసి పనిచేసుకోవాలని కోరుతున్నాను. గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులను ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది కనుక కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు తమ తమ గ్రామాల అభివృద్ధికి గట్టిగా కృషి చేయాలని కోరుతున్నాను. అధికారం, నిధుల దుర్వినియోగం, విధి నిర్వ్బహణలో అలసత్వం ప్రదర్శిస్తే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం పదవులు కోల్పోయే ప్రమాదం ఉందని అందరూ గుర్తుంచుకొని పనిచేసుకోవాలని కోరుతున్నాను,” అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ అభ్యర్ధి కె ఉపేందర్ రెడ్డి చేతిలో కేవలం 7,669 ఓట్లు తేడాతో ఓడిపోయారు. మంత్రిగా ఉన్నప్పుడూ జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి పూర్తిచేసిన తుమ్మల సునాయాసంగా భారీ మెజార్టీతో గెలుస్తారని అందరూ ఊహిస్తే అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. తన ఓటమికి ఖమ్మం తెరాస ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డే కారణమని తుమ్మల ఆరోపిస్తున్నారు. 


Related Post