త్వరలో లోక్‌సభ అభ్యర్ధుల పేర్లు ఖరారు: భట్టి

February 11, 2019


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కసరత్తు మొదలుపెట్టాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పాలైన రాష్ట్ర కాంగ్రెస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చాలా పట్టుదలగా ఉంది. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు మాత్రమే ఉన్నాయి కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన సీనియర్లు కూడా లోక్‌సభ ఎన్నికలలో తమ అదృష్టాన్ని పరిశీలించుకోవాలనుకొంటున్నారు. ఒక్కో సీటుకు పార్టీలో 2-3 మంది పోటీ పడుతున్నట్లు సమాచారం కనుక పార్టీలో టికెట్ల కోసం గట్టి పోటీయే నెలకొంది. ఈ నెలాఖరులోగా అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తామని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. 

ఈనెల 16న టిపీసిసి సమన్వయ కమిటీ సమావేశం, 17న ఎన్నికల కమిటీ సమావేశం జరుగనున్నాయి. వాటిలో అభ్యర్ధుల జాబితా తయారయ్యే అవకాశం ఉంది. ఆ జాబితాలో నుంచి గెలుపు గుర్రాల జాబితాను తయారుచేసి కాంగ్రెస్‌ అధిష్టానానికి పంపిస్తారు. దానిపై కాంగ్రెస్‌ అధిష్టానం చర్చించి అభ్యర్ధుల పేర్లను ఖరారు చేస్తుంది. ఈ తతంగమంతా పూర్తికావడానికి మరో 10-15 రోజులు పట్టవచ్చు కనుక ఈ నెలాఖరుకి లేదా మార్చి మొదటివారంలో లోక్‌సభకు పోటీ చేయనున్న కాంగ్రెస్ అభ్యర్ధుల పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.


Related Post