ప్రధానిని ఈవిధంగా అవమానించడం భావ్యమేనా?

February 09, 2019


img

రాజకీయాలలో ఉన్నవారు ఒకరినొకరు ఎన్నైనా విమర్శించుకోవచ్చు  కానీ ప్రజలను కూడా ఆ బురదలోకి లాగాలనుకోవడం ఎవరూ హర్షించలేరు. టిడిపి-బిజెపిల మద్య మొదలైన రాజకీయ యుద్దం రేపు ప్రధాని నరేంద్రమోడీ గుంటూరు పర్యటనతో పరాకాష్టకు చేరింది. 

ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్రంలో అడుగుపెట్టకూడదంటూ టిడిపి నేతలు మట్టికుండలు, నల్లజెండాలు పట్టుకొని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అవి ఏ స్థాయికి చేరాయంటే విజయవాడలో ఓ ప్రధానకూడలిలో ఉన్న ప్రచార హోర్డింగ్ మీద ఒక ఫ్లెక్సీ బ్యానరు ఏర్పాటు చేశారు. దానిలో ప్రధాని నరేంద్రమోడీ తప్పు చేసినట్లు చేతులు కట్టుకొని తల దించుకొని ఉన్న చిత్రంతో ‘మోడీ నో ఎంట్రీ’ అని వ్రాసుంది. మోడీకి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయాలని సిఎం చంద్రబాబునాయుడు స్వయంగా పిలుపు ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి కార్యకర్తలు పచ్చ చొక్కాలు ధరించి, ‘మోడీ గో బ్యాక్’ అంటూ వ్రాసున్న ఫ్లెక్సీ బ్యానర్లు పట్టుకొని రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. 

టిడిపి-బిజెపిలు కలిసున్నంతకాలం చంద్రబాబుకి ప్రధాని మోడీలో ఏ తప్పు, లోపం కనిపించలేదు. పైగా అద్భుతమైన నాయకుడిగా అభివర్ణించేవారు. కానీ బిజెపితో తెగతెంపులు చేసుకొన్నప్పటి నుంచి మోడీలో అన్ని తప్పులు, లోపాలే కనిపిస్తున్నాయి! 2014 ఎన్నికలలో ఏ‌పీకి ప్రత్యేకహోదా ఇస్తానని మోడీ చెప్పినమాట వాస్తవం. కానీ ఆ తరువాత అది సాధ్యం కాదని, ఏపీకి ఇస్తే దేశంలో అనేక రాష్ట్రాలు హోదా కోసం ఉద్యమిస్తాయని, కనుక హోదాకు ఏమాత్రం తీసిపోని ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ఇస్తామని చెప్పినప్పుడు చంద్రబాబు స్వయంగా దానిని స్వాగతించారు. ఆ ప్యాకేజీ చాలా బేషుగ్గా ఉందంటూ మాజీ కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి బాబు సన్మానం కూడా చేశారు. గొప్ప ప్యాకేజీ ఇచ్చినందుకు మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ శాసనసభలో తీర్మానం కూడా చేసి పంపారు. అప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వకపోయినా పరువాలేదన్న చంద్రబాబే ఇప్పుడు ఇవ్వకుండా ఏపీని ప్రధాని నరేంద్రమోడీ మోసం చేశారని వాదిస్తూ ధర్మపోరాటాలు చేస్తుండటం విడ్డూరంగా ఉంది. టిడిపి-బిజెపిల మద్య రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, దేశాధినేత అయిన నరేంద్రమోడీ రాష్ట్రానికి అతిధిగా వస్తున్నప్పుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడే ఆయనకు నిరసనలు తెలుపాలని ప్రజలను కోరడం, ఈవిధంగా అగౌరవంగా వ్యవహరించడం ఎవరూ హర్షించలేరు. ప్రధాని మోడీ పట్ల టిడిపి వ్యవహరిస్తున్న ఈ తీరును చూస్తున్న దేశప్రజలు రేపు లోక్‌సభ ఎన్నికలలో టిడిపితో పొత్తులు పెట్టుకొనందుకు కాంగ్రెస్ పార్టీని కూడా తెలంగాణ ప్రజలలాగే తిరస్కరించే ప్రమాదం కూడా ఉంటుంది.


Related Post