కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ?

February 09, 2019


img

జాతీయరాజకీయాలలో గుణాత్మకమైన మార్పు సాధించడం కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌, అందుకోసం తన పదవికి రాజీనామా చేసి లోక్‌సభకు పోటీ చేయబోతున్నారా? అందుకే తెరాస అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదా?అనే సందేహాలకు తెరాస నేత పిడమర్తి రవి చేసిన తాజా వ్యాఖ్యలలో చూచాయగా జవాబు కనిపిస్తోంది. 

సత్తుపల్లిలో శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ, “సిఎం కేసీఆర్‌ ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయవలసిందిగా కార్యకర్తల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే ఆయన ఎవరి పేరు సూచిస్తే వారికి మేమందరం సహకరించి గెలిపించుకొంటాము,” అని రవి అన్నారు. 

ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ చేయవలసిన అవసరం లేదు కానీ తెరాస సీనియర్ నేత అటువంటి ప్రతిపాదన చేశారంటే అదేదో మాటవరసకి అన్నది కాదని అర్ధం అవుతోంది. నిప్పు లేనిదే పొగరాదన్నట్లు కేసీఆర్‌కు లోక్‌సభకు పోటీ చేయాలనే ఆలోచనే లేకపోతే తెరాసలో ఎవరూ ఇంత ధైర్యంగా కేసీఆర్‌ రాజీనామా చేసి లోక్‌సభకు పోటీ చేయాలనే ప్రతిపాదన చేయరు. కనుక కేసీఆర్‌ మనసులో మాటనే పిడమర్తి రవి పలికి ఉండవచ్చు. 

సాధారణంగా తెరాస ముఖ్య నేతలు కొన్ని సమయాలలో చేసే నిర్ధిష్టమైన ఇటువంటి వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అవి కేసీఆర్‌ వ్యూహంలో భాగమేనని ఆ తరువాత స్పష్టం అవుతుంటుంది. అసెంబ్లీ ఎన్నికలు కీలకదశకు చేరుకొన్నప్పుడు మాజీ మంత్రి కేటీఆర్‌ ‘ఏపీ రాజకీయాలలో వేలు పెడతామని’ చేసిన వ్యాఖ్యలను ఆ తరువాత కేసీఆర్‌ కూడా దృవీకరించడం గమనిస్తే ఆయన మనసులో మాటనే కేటీఆర్‌ చెప్పినట్లు స్పష్టమైంది.  

కేసీఆర్‌ తన మనసులో రూపు దిద్దుకొంటున్న ఆలోచనలను, రాజకీయ వ్యూహాలను పార్టీలో సీనియర్ నేతల ద్వారా ఒక పద్దతి ప్రకారం మెల్లమెల్లగా బయటపెట్టడం గతంలో చాలాసార్లు చూశాము. కనుక పిడమర్తి రవి అన్న మాటలు కూడా కేసీఆర్‌ మనసులో మాటగానే భావించవచ్చు. అయితే కేసీఆర్‌ ఖమ్మం నుంచి పోటీ చేస్తారా లేక వేరే చోట నుంచి చేస్తారా? అనేది అప్రస్తుతం. కానీ లోక్‌సభకు పోటీ చేసే అవకాశం మాత్రం ఉందని భావించవచ్చు. 

సిఎం కేసీఆర్‌ తాను జాతీయరాజకీయాలలో ప్రవేశిస్తానని స్వయంగా చెప్పారు. కానీ ఒకపక్క ముఖ్యమంత్రిగా రాష్ట్రం బాధ్యతలు చూసుకొంటూ జాతీయరాజకీయాలలో చురుకుగా పాల్గొనడం కష్టం. కనుక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి లోక్‌సభకు పోటీ చేయవలసి ఉంటుంది. 

ఒకవేళ సిఎం కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ చేసి జాతీయరాజకీయాలలోకి వెళితే ముఖ్యమంత్రి పదవి ఖాళీ అవుతుంది కనుక దానిని ఎవరు అధిష్టిస్తారో అందరికీ తెలిసిందే. బహుశః ఈ ఆలోచనతోనే సిఎం కేసీఆర్‌ ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు చేయలేదేమో? రేపు సాయంత్రం సిఎం కేసీఆర్‌ మంత్రివర్గం ఏర్పాటు చేయబోతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కానీ అది కూడా పూర్తిస్థాయి మంత్రివర్గం కాకుండా 8-9 మంది మంత్రులతోనే ఏర్పాటు చేయబోతున్నట్లు, మిగిలినవారిని లోక్‌సభ ఎన్నికల తరువాత ఏర్పాటు చేస్తారన్నట్లు వార్తలు వస్తున్నాయి. అవి నిజమైతే కేసీఆర్‌ లోక్‌సభకు పోటీ చేయడం, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం కూడా నిజమే కావచ్చు.


Related Post