విపక్ష కూటమి ఓ కల్తీ సరుకు: మోడీ

February 08, 2019


img

రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ ప్రసంగానికి లోక్‌సభ ధన్యవాదాలు తెలిపే చర్చలో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్‌ మిత్రపక్షాల విమర్శలకు జవాబిస్తూ, తనను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నేతృత్వంలో 23 ప్రాంతీయ పార్టీలతో కలిసి ఏర్పాటవుతున్న కూటమిని ఒక కల్తీసరుకుగా వర్ణించారు. “వారిలో చాలా మంది బెయిల్ పై బయటున్నవారే. గతంలో కుంభకోణాలకు పాల్పడినవారే. మన న్యాయ, రక్షణ, ఇతర రాజ్యాంగ వ్యవస్థలను అవమానించి దుర్వినియోగం చేసినవారే. వారే ఇప్పుడు మా ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేస్తోందని, అవినీతికి పాల్పడుతోందని ఆరోపణలు చేస్తుండటం చూస్తుంటే దొంగే దొంగ... దొంగ..అని అరుస్తున్నట్లుంది. అటువంటి అవినీతిపరులు, అసమర్ధులు కలిసి ఏర్పాటు చేసుకొంటున్న కూటమి రేపు కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశం ఏమవుతుందో ఎవరూ ఊహించలేరు.

గత 55 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేకపనులను మా ప్రభుత్వం 55 నెలలోనే చేసి చూపించింది. కాంగ్రెస్‌ హయాంలో  కనీసం మన సైనికులకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బూట్లు వంటివి కూడా కొనివ్వకుండా అవినీతికి పాల్పడింది. కానీ మా ప్రభుత్వం సైనికులకు వాటితో సహా అత్యాధునిక ఆయుధాలను సమకూర్చిపెట్టింది. దేశరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తీవ్ర నిర్లక్ష్యం వహించింది. కానీ మా ప్రభుత్వం అత్యాధునిక రఫెల్ యుద్దవిమానాలు కొనుగోలు చేసి సైన్యానికి అందజేస్తుంటే దానిపై కూడా కాంగ్రెస్ నేతలు అసత్య ప్రచారం చేస్తూ రాజకీయ లబ్దిపొందాలని కలలు కంటున్నారు. అయితే చురుకుగా, పారదర్శకంగా, అవినీతి రహితంగా పాలన సాగిస్తున్న మమ్మల్నే ప్రజలు మళ్ళీ ఎన్నుకొంటారనే నమ్మకం నాకుంది. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కూటమిగా ఏర్పడినంత మాత్రన్న ప్రజలు వాటిని అంగీకరిస్తారనుకోవడం అత్యాశే అవుతుంది,” అని అన్నారు.

కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటవుతున్న మహాకూటమిని ఉద్దేశ్యించి ప్రధాని నరేంద్రమోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. మహాకూటమి దేశంలో వైవిద్యతకు నిదర్శనమని దానిని కల్తీ సరుకని ప్రధాని చులకనగా మాట్లాడాన్ని కాంగ్రెస్‌ నేతలు తప్పు పడుతున్నారు. కాంగ్రెస్‌ కూటమి-బిజెపిల మద్య జరుగుతున్న ఈ వాదోపవాదాలను పక్కనపెడితే, సిఎం కేసీఆర్‌ కూడా బిజెపియేతర పార్టీలను కలుపుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేసి మోడీని గద్దె దించుతామని అంటున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోడీ తన గంటన్నర ప్రసంగంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రస్తావనే చేయనేలేదు. అసలు అటువంటి ప్రయత్నం జరుగుతున్నట్లు తనకు తెలియనట్లే మోడీ వ్యవహరిస్తున్నారు. అంటే ఫెడరల్‌ ఫ్రంట్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఆశీర్వాదం ఉందనుకోవచ్చా?


Related Post