నిన్న మధులిక...నేడు హర్షిత.. ప్రేమోన్మాదుల ఘాతుకాలకు బలి

February 08, 2019


img

ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడిన మధులిక మలక్ పేట యశోదా ఆసుపత్రిలో ఇంకా ప్రాణాపాయ స్థితిలోనే ఉంది. ఈలోగానే రాష్ట్రంలో అటువంటిదే మరో ఘటన జరిగింది. మధులిక ప్రేమోన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో పోరాడుతుంటే, సిరిసిల్లా జిల్లాలోని కధాలాపూర్ మండలంలోని దుంపెట గ్రామానికి చెందిన తోట హర్షిత (19) ప్రేమోన్మాది వేదింపులు భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది. 

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం దుంపెట గ్రామానికి చెందిన హర్షిత కోరుట్లలో డిగ్రీ చదువుకొంటోంది. గత కొంతకాలంగా ఒక యువకుడు ఆమె వెంటపడుతూ ప్రేమించాలని వేదిస్తున్నాడు. ఈ విషయం ఉపాద్యాయులకు, తల్లి తండ్రులకు చెప్పలేక ఎంతో మానసికవేదన అనుభవించిన హర్షిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో శుక్రవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. హర్షిత తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు. హర్షిత మరణానికి కారకుడైన ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మధులిక, హర్షితలిద్దరూ ప్రేమోన్మాద బాధితులే. వారిలో మధులిక ధైర్యం చేసి తన తల్లితండ్రులకు వేదింపుల గురించి చెప్పడంతో వారు స్థానిక పెద్దలతో, ఆ తరువాత పోలీసులతో ఆమె వెంటపడుతున్న భరత్ కు చాలాసార్లు కౌన్సిలింగ్, హెచ్చరికలు ఇప్పించారు. కానీ వారు అతని ప్రేమోన్మాద తీవ్రతను, వైఖరిని సరిగ్గా అర్ధం చేసుకోకుండా హెచ్చరికలతో సరిపెట్టడం వలన మధులికకు నేడు ఈ దుస్థితి ఏర్పడింది. 

వేదింపుల గురించి హర్షిత తన పెద్దలకు లేదా ఉపాధ్యాయులకు చెప్పి ఉండి ఉంటే వారు ఆమెను ఆ యువకుడి బారి నుంచి కాపాడి ఉండేవారేమో? కానీ తీవ్ర ఆందోళన, మానసికవేదన అనుభవించిన హర్షిత నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకొని నిండు నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించి ఈలోకం నుంచి వెళ్ళిపోయింది. 

దశాబ్ధాలుగా నెలకొన్న ఈ సమస్యకు కారణాలు ఏమిటి? వీటికి పరిష్కారమే లేదా? ప్రేమోన్మాదుల చేతిలో యువతులు నిస్సహాయంగా బలైపోవలసిందేనా? అని ఆలోచిస్తే ఈ సమస్యకు అనేక కారణాలు, పరిష్కారాలు కూడా కనిపిస్తాయి. 

సినిమాలలో హీరోలు హీరోయిన్ల వెంటపడటం, అది చాలా గొప్ప విషయమన్నట్లు చూపించడం నేటి యువతపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పవచ్చు. హీరో వెంటపడి గ్రూప్ డ్యాన్సులు చేస్తుంటే హీరోయిన్ మూసిముసినవ్వులు నవ్వుకొంటూ ఆనందించడం సినిమాలలో చూస్తుంటాము. కనుక నిజజీవితంలో కూడా యువతుల వెంటపడితే వారు ఆవిధంగానే స్పందిస్తారని యువకులలో భ్రమ కలిగితే అది వారి తప్పు కాదు. కనుక సినిమాల వలన కూడా యువత ఇటువంటి తప్పుడు పనులు చేస్తోందని చెప్పక తప్పదు.

బాల్యం నుంచే తల్లితండ్రులు, ఉపాద్యాయులు మగపిల్లలకు మహిళలపట్ల గౌరవంగా మసులుకొనేవిదంగా శిక్షణ ఇస్తే ఇటువంటి సమస్యలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలో మహిళలను వేదించేవారిని గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకొనేందుకు పోలీస్ శాఖలో ‘షీ-టీమ్స్’ ఏర్పాటు చేసినప్పటికీ అవి ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉండటం గమనిస్తే షీ-టీమ్స్ సంఖ్య ఇంకా పెంచవలసి ఉందని అర్ధమవుతోంది.

ఇటువంటి నేరాలకు పాల్పడినవారికి కటినమైన శిక్షలు అమలుచేసి ఆ విషయం అందరికీ...ముఖ్యంగా నేర ప్రవృత్తి ఉన్న యువకులకు తెలిసేలా ప్రచారం చేయడం కూడా చాలా అవసరమే.  ఈ చర్యలన్నీ సమాంతరంగా  అమలుచేసినప్పుడే ఇటువంటి విషాద ఘటనలు పునరావృతం కాకుండా నివారించవచ్చు. 


Related Post