ఒంటేరు తెరాసలో చేరడం తప్పా... ఒప్పా?

January 19, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్‌తోనే పోటీ పడి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరడాన్ని సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు తప్పుపట్టారు. ఒంటేరుకు పార్టీలో చాలా ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, ఎన్నికలలో ఓడిపోగానే నిసిగ్గుగా తెరాసలో చేరిపోయారని ఆక్షేపించారు. కేవలం తన స్వార్ధ ప్రయోజనల కోసమే ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తెరాసలో చేరిపోయారని, ఆయనొక అవకాశవాద రాజకీయనాయకుడని వి.హనుమంతరావు అన్నారు. అటువంటి అవకాశవాద రాజకీయ నాయకులకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వకూడదని సూచించారు. తెలంగాణ ఏర్పాటు చేయాలని కోరుతూ లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్ పార్టీ కలిస్తే తప్పని వాదించిన కేసీఆర్‌, తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన జగన్మోహన్ రెడ్డితో ఏవిధంగా చేతులు కలుపుతున్నారని వి.హనుమంతరావు ప్రశ్నించారు.

ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీలో ప్రాధాన్యం ఇచ్చిన మాట వాస్తవమే కావచ్చు కానీ వరుసగా రెండుసార్లు పోటీ చేసిఓడిపోవడంతో ఆర్ధికంగా దెబ్బతిన్నారు అందుకే ఇక తెరాసతో పోరాడే శక్తిలేక ఆ పార్టీలో చేరిపోయారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పిన మాట కూడా వాస్తవం. కేసీఆర్‌ వంటి అత్యంత ప్రజాధారణ ఉన్న వ్యక్తితో ఒంటేరు ప్రతాప్‌రెడ్డి పోటీ పడుతున్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఆయనకు అన్ని విధాలా సహకరించి ఉండాలి. అలాగే రాష్ట్ర నేతలు, రాహుల్ గాంధీ తదితరులు గజ్వేల్ లో ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసి ఉండాలి. కానీ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి ఒంటరి పోరాటమే చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్ గాంధీతో తమకున్న పరిచయాన్ని, పలుకుబడిని ఉపయోగించుకొని తమ తమ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచార సభలు నిర్వహింపజేసుకున్నారు తప్ప ఒంటేరు ప్రతాప్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయించడానికి తీసుకువెళ్లలేదు. అయినప్పటికీ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి చివరివరకు చాలా నిబ్బరంగా ఒంటరిగా పోరాడారు. ఆయన పోరాట పటిమను సిఎం కేసీఆర్‌ కూడా గుర్తించారు కానీ కాంగ్రెస్‌ పెద్దలెవరూ పట్టించుకోనేలేదు. కనుక ఒంటేరు ప్రతాప్‌రెడ్డి తన ఆర్ధిక, రాజకీయ పరిస్థితులను బేరీజు వేసుకొని తెరాసలో చేరి మంచినిర్ణయమే తీసుకున్నారని చెప్పవచ్చు. 


Related Post