ఆ ఆలోచనతోనే కేసీఆర్‌ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారా?

January 19, 2019


img

తెలంగాణ సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ప్రాంతీయపార్టీలతో కూటమిని ఏర్పాటు చేయడం, వాటినన్నిటినీ కలిపి ఉంచడం, వాటితో కేంద్రప్రభుత్వాన్ని నడిపించడం అనేవి దాదాపు అసంభవమని చెప్పవచ్చు. ఎందుకంటే, ప్రాంతీయ పార్టీలలో దాదాపు అన్ని కూడా పీకలలోతు అవినీతిలో కూరుకొని పోయున్నాయి. అలాగే తీవ్ర అధికారదాహంతో ఉన్నాయి. 

పైగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం, అలాగే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలు కూడా చాలా బలంగానే ఉన్నాయి. రెంటికీ ఆ ప్రాంతీయ పార్టీలే మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్ వలన తమకు ఎన్నికలలో నష్టం కలుగుతుందని భావిస్తే కాంగ్రెస్‌, బిజెపిలు చూస్తూ ఊరుకోవు. సామదానభేదదండోపాయాలను ఉపయోగించి ప్రాంతీయ పార్టీలను తమ చేజారిపోకుండా కాపాడుకొనే ప్రయత్నం చేస్తాయి. కాంగ్రెస్‌ అటువంటి ప్రయత్నాలు గట్టిగానే చేస్తోంది కానీ బిజెపి చేస్తున్నట్లు కనబడటం లేదు. అంటే కేసీఆర్‌ ఫ్రంట్ వలన తమకు నష్టం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కానీ బిజెపి కాదని స్పష్టం అవుతోంది. 

కేసీఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకిస్తున్నారని అందరికీ తెలుసు. కానీ మోడీని (బిజెపిని) వ్యతిరేకిస్తున్నట్లు ఎవరూ భావించడం లేదు. చివరికి ప్రధాని నరేంద్రమోడీ కూడా భావించడంలేదు. కనుకనే కేసీఆర్‌ ఫ్రంట్ గురించి తనకు తెలియనే తెలియదన్నారు. అంటే లోక్‌సభ ఎన్నికల తరువాత మోడీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి తోడ్పడేందుకే కేసీఆర్‌ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు మీడియాలో వస్తున్న ఊహాగానాలలో ఎంతో కొంత నిజముందని అర్ధం అవుతోంది. 

అయితే, తెరాసలో కొందరు నేతలు అప్పుడప్పుడు, “కేసీఆర్‌ ప్రధానమంత్రి కావలసిన అవసరం ఉంది...కేసీఆర్‌ ప్రధాని కావాలని దేశప్రజలు కోరుకొంటున్నారు....16ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతాము” అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆలోచించవలసిన విషయమే. 

తెరాసలో కేటీఆర్‌ మొదలు దిగువస్థాయి నేతల వరకు ఎవరైనా ఎప్పుడైనా ఇటువంటి వ్యాఖ్యలు చేశారంటే ఆ తరువాత ఏదో ఓ సందర్భంలో సిఎం కేసీఆర్‌ కూడా వాటిని దృవీకరిస్తుండటం అందరూ గమనించే ఉంటారు. ఉదాహరణకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకున్నప్పుడు “ఏపీ రాజకీయాలలో జోక్యం చేసుకొంటామని” కేటీఆర్‌ ప్రకటించారు. ఆ తరువాత తలసాని తదితర నేతలు అదే చెప్పారు. చివరిగా మాట్లాడిన కేసీఆర్‌ కూడా అదే నొక్కి చెప్పారు. అంటే కేసీఆర్‌ వ్యూహాన్నే తెరాస నేతలందరూ అమలుచేస్తున్నారని స్పష్టం అవుతోంది. కనుక “కేసీఆర్‌ ప్రధానమంత్రి కావాలనే” అనే తెరాస నేతల డిమాండ్లు కూడా కేసీఆర్‌ వ్యూహంలో భాగమేనని భావించవలసి ఉంటుంది. 

అంటే కేసీఆర్‌ ఫ్రంట్ ఏర్పాటుకు ఇప్పుడు రెండు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 1. వీలైతే తాను ప్రధానమంత్రి పదవి చేపట్టడం లేకుంటే నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేందుకు సహకరించడం కోసం కావచ్చు. మాయావతి, మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ తదితరులు తాము ప్రధానమంత్రి రేసులో ఉన్నామని బహిరంగంగానే చెప్పుకొంటుంటే, కేసీఆర్‌ మాత్రం తొందరపడి ఆవిధంగా చెప్పకుండా, మెల్లగా అందుకోసం ప్రయత్నాలు చేస్తూ తెరాస నేతల ద్వారా తన ప్రజాస్పందనను, తన అవకాశాలను, మిత్రపక్షాల ప్రతిస్పందనను పరిశీలించుకొంటున్నారనిపిస్తోంది. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ వెనుక ఇటువంటి ఆలోచనలు లేదా ఉద్దేశ్యాలు  కనబడుతున్నందునే ఆయన ప్రతిపాదనపై ప్రతిపక్షాలు, మీడియా తరచూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని భావించవచ్చు.


Related Post