ఎవరు ఎన్ని ఫ్రంట్లు, టెంట్లు వేసుకొన్నా నష్టం లేదు: లక్ష్మణ్

January 19, 2019


img

తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబునాయుడు జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్ స్పందిస్తూ, “ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విషయం దేశప్రజలందరూ గుర్తించారు. కనుక ఎవరు ఎన్ని ఫ్రంట్లు పెట్టుకున్నా మాకు వచ్చే నష్టం లేదు. ఎవరు ఎన్నిటెంట్లు వేసుకొన్నా మాకు అభ్యంతరం లేదు. ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసీఆర్‌, చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడం తధ్యం. వారిరురువురివి కుటుంబ పార్టీలు. దేశంలో అటువంటి కుటుంబపార్టీలను కలుపుకొని కేంద్రంలో అధికారంలోకి రావాలని ఇద్దరూ పగటి కలలు కంటున్నారు. కానీ నేటికీ కూటమికి ప్రధానమంత్రి అభ్యర్ధి ఎవరో వారు తేల్చుకోలేకపోతున్నారు. గతంలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చాలానే జరిగాయి కానీ ఏవీ ఫలించలేదు. అయినా జాతీయపార్టీ లేని ఏ కూటమి ఎన్నడూ విజయం సాధించదు. తెలంగాణతో సహా యావత్ దేశ ప్రజలు మళ్ళీ మోడీయే ప్రధానమంత్రి కావాలని కోరుకొంటున్నారు. కనుక ‘మోడీ మరోసారి’ అనే నినాదంతో మేము ప్రజల ముందుకు వెళ్లబోతున్నాము,” అని అన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఫలితాలే లోక్‌సభ ఎన్నికలలో కూడా పునరావృతమవుతాయని తెరాస నమ్మకంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెరాసకు పూర్తి అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి కనుక లోక్‌సభ ఎన్నికలలో కూడా గులాబీ జెండా ఎగురవచ్చు. 

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర బిజెపి నేతలను అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సంసిద్దం చేయడానికి గట్టి ప్రయత్నాలే చేసినప్పటికీ, వారు మోడీ జపంతో గట్టెక్కేయవచ్చుననే భ్రమలో కాలక్షేపం చేయడంతో ఓటమి పాలయ్యారు. అదీగాక కేసీఆర్‌-మోడీ మద్య స్నేహసంబంధాలు బిజెపి విశ్వసనీయతను దెబ్బతీశాయి. ఇప్పటికీ అవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. రాష్ట్ర బిజెపి నేతల వైఖరిలో కూడా మార్పు కనబడటం లేదు. పైగా అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందినందున బిజెపి నేతలు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. కనుక రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలలో బిజెపి ఒక్క స్థానమైనా గెలుచుకొంటే అది చాలా గొప్ప విషయమే అవుతుంది. 


Related Post