ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసమే కేటీఆర్‌-జగన్ భేటీ: వైకాపా

January 16, 2019


img

ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లో లోటస్ పాండ్ నివాసంలో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌-వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం వారిరువురూ మీడియాతో మాట్లాడారు.

“ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేసే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవాలని మేము భావిస్తున్నాము. జాతీయ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం కలిసివచ్చే పార్టీలతో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుచేయాలని భావిస్తున్నందున వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి కలిశాము. ఏ‌పీకి ప్రత్యేకహోదాతో సహా పలు అంశాల గురించి మేము చర్చించాము. వాటిపై మా పార్టీ వైఖరిని జగన్మోహన్ రెడ్డికి తెలియజేశాము. త్వరలో సిఎం కేసీఆర్‌ ఏపీకి వచ్చి జగన్మోహన్ రెడ్డితో సమావేశమవుతారు,” అని కేటీఆర్‌ అన్నారు. 

జగన్ మాట్లాడుతూ, “ఒక్కో రాష్ట్రం వేర్వేరుగా పోరాడుతుంటే కేంద్రప్రభుత్వం పట్టించుకోదు. కనుక సమస్యల పరిష్కారానికి దేశంలో అన్ని ప్రాంతీయ పార్టీలు ఏకం కావాలి. ఏ‌పీకి ప్రత్యేకహోదా కోసం మా పార్టీ ఒంటరిగా ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం కనబడలేదు. ఇప్పుడు ఇరుగుపొరుగు రాష్ట్రాలు కూడా మాకు మద్దతు పలికి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రాల హక్కులు, ప్రయోజనలు కాపాడుకోవాలంటే ఇటువంటి పరస్పర సహకారం చాలా అవసరం. కనుక సిఎం కేసీఆర్‌ చేస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదనను మేము స్వాగతిస్తున్నాము. త్వరలోనే కేసీఆర్‌గారు ఏపీ వచ్చి నాతో మాట్లాడుతానని చెప్పారు. ఈరోజు సమావేశంలో చర్చించుకున్న అంశాలపై మా పార్టీలో చర్చించుకొని తగిన నిర్ణయం తీసుకుంటాము,” అని జగన్ అన్నారు. 

జగన్-కేటీఆర్‌ సమావేశం కేవలం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు గురించి మాత్రమే తప్ప ఏపీ రాజకీయాల గురించి కాదని వైకాపా నేత అంబటి రాంబాబు చెప్పారు. కానీ జగన్-కేటీఆర్‌ భేటీపై అప్పుడే టిడిపి నేతలు నోటికి వచ్చినట్లు వాగుతున్నారని అన్నారు.


Related Post