జగన్‌-కేటీఆర్‌ భేటీ!

January 16, 2019


img

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, కొందరు సీనియర్ తెరాస నేతలు బుధవారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. కేసీఆర్‌ సూచన మేరకు వారు జగన్మోహన్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలోగా ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటుచేయాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నందున వివిద రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల అధినేతలతో చర్చిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో భాగంగానే ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యి ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామిగా చేరాలని కేటీఆర్‌ కోరనున్నారు. 

ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగస్వామి కావడం అంటే మిత్రపక్షాలనే అర్ధం. ఏపీలో తన పార్టీ గెలిచేందుకు తెరాస మద్దతు ఇస్తానని ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదంటారు? సంతోషంగా అంగీకరిస్తారు. కానీ తెరాసతో వైకాపా బహిరంగంగా దోస్తీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది.   

తెలంగాణను దెబ్బతీయాలని చూస్తున్న చంద్రబాబునాయుడుతో కాంగ్రెస్‌ పార్టీ దోస్తీ చేసిందనే వాదనతో ప్రజాకూటమిపట్ల తెలంగాణ ప్రజలలో తెరాస ఏవిదంగా వ్యతిరేకత సృష్టించి విజయం సాధించిందో, అదేవిధంగా తెరాసతో జగన్ బహిరంగంగా దోస్తీ చేస్తే, అప్పుడు చంద్రబాబునాయుడు, టిడిపి నేతలు కూడా ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న తెరాసతో జగన్ దోస్తీ చేస్తున్నారంటూ ప్రచారం చేయడం ఖాయం. కనుక తమ దోస్తీ ఫెడరల్‌ ఫ్రంట్‌ వరకు మాత్రమేనని జగన్ ప్రకటించవచ్చు. 

కానీ ఏపీ రాజకీయాలలో వేలు పెడతానని, చంద్రబాబునాయుడుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని  సిఎం కేసీఆర్‌ ప్రకటించారు కనుక వైయస్సార్ కాంగ్రెస్-తెరాస దోస్తీ ఏపీలో జరుగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు కూడా వర్తిస్తుందనేది బహిరంగ రహస్యమే. అందుకే అప్పుడే చంద్రబాబునాయుడుతో సహా ఏపీ టిడిపి మంత్రులందరూ వైయస్సార్ కాంగ్రెస్-తెరాస దోస్తీని కుట్రగా అభివర్ణిస్తున్నారు.


Related Post