అప్పుడు కేసీఆర్‌కు...ఇప్పుడు బాబుకు నొప్పి!

January 14, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఏపీ సిఎం చంద్రబాబునాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపి ప్రజాకూటమిని ఏర్పాటు చేసి తెరాసకు గట్టి సవాలు విసిరినప్పుడు, తెలంగాణ రాష్ట్రంపై పెత్తనం చేయడానికి...తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకే చంద్రబాబు ప్రజాకూటమి ముసుగులో వస్తున్నారని కేసీఆర్‌ గట్టిగా వాదించి ప్రజలను ఒప్పించగలిగారు. 

అయితే నిజానికి ప్రజాకూటమి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకొనేందుకు ఏర్పడినది కాదని, అసెంబ్లీ ఎన్నికలలో ఏదోవిధంగా గెలిచి అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుతో చేతులు కలిపిందని అందరికీ తెలుసు. మరోవిధంగా చెప్పాలంటే తెరాసను ఓడించాలనే ఏకైక ఉద్దేశ్యంతోనే ప్రజాకూటమి ఏర్పడిందని చెప్పవచ్చు. కానీ వారు తెరాసను ఓడించడానికి కాక తెలంగాణ రాష్ట్రాన్ని విద్వంసం చేయడానికే చేతులు కలిపారనే అనూహ్యమైన వాదనతో కేసీఆర్‌ ప్రజలను మెప్పించి విజయం సాధించగలిగారు. 

తెలంగాణలో తిరుగులేని తన అధికారాన్ని సవాలు విసిరినందుకు సిఎం కేసీఆర్‌ చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. అదే రిటర్న్ గిఫ్ట్! ఏపీ రాజకీయ వ్యవహారాలలో తాను తప్పకుండా వేలుపెడతానని కేసీఆర్‌ నిర్ద్వందంగా ప్రకటించారు. రాగల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో అధికార టిడిపిని ఓడించి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న జగన్మోహన్ రెడ్డిని సిఎం కేసీఆర్‌ ఆయుధంగా ఉపయోగించుకుంటారని అందరూ ఊహించారు. వారికి మోడీ సహకరిస్తూ ఆ కుట్రలో భాగం పంచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. 

వాస్తవానికి వారు ముగ్గురూ బహిరంగంగా చేతులు కలపకపోయినా వారు టిడిపిని ఓడించాలనుకొంటున్నారనేది సుస్పష్టం. అయితే వారు వేర్వేరు ఆలోచనలు ఉద్దేశ్యాలతో చేతులు కలిపారని చెప్పవచ్చు. కేసీఆర్‌, మోడీల సాయంతో ఏపీలో అధికారం దక్కించుకోవాలని జగన్ ఆశపడుతుంటే, జగన్ ఆయుధంగా ఉపయోగించుకొని చంద్రబాబును ఎన్నికలలో దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకోవాలని కేసీఆర్‌ కోరిక తప్ప ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడం కాదని అందరికీ తెలుసు.  ఏపీలో బిజెపిని కాపాడుకోవాలని మోడీ తాపత్రయపడుతున్నట్లు చెప్పవచ్చు. 

అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు చేసిందే ఇప్పుడు కేసీఆర్‌ చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమీ చేయడం లేదని అర్ధమవుతోంది. కానీ ఏపీ అభివృద్ధిని చూసి సహించలేక, తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే మోడీ, కేసీఆర్‌, జగన్ ముగ్గురూ కలిసి కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు అండ్ కో వాదిస్తున్నారు. 

అంటే టిడిపి అధికారాన్ని సవాలు చేయడమంటే ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమేననే బాబు వాదన  ఆనాడు ప్రజాకూటమి గురించి కేసీఆర్‌ చేసిన వాదనలాగే ఉందన్న మాట. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు వేలుపెట్టినప్పుడు కేసీఆర్‌కు కలిగిన నొప్పినే ఇప్పుడు చంద్రబాబు కూడా అనుభవించేలా చేస్తున్నారు కేసీఆర్‌. ఆ నొప్పిని భరించడం కష్టమని చంద్రబాబుకు కూడా ఈపాటికి అర్ధమయ్యే ఉంటుంది.


Related Post