మా ప్రధాని అభ్యర్థి మాయావతి: అఖిలేష్

January 12, 2019


img

వచ్చే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ గెలిస్తే మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధాని అవుతారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. కానీ ఈ రెండు పార్టీలు ఎన్నికలలో విఫలమైతే ఎవరు ప్రధానమంత్రి అవుతారో ఊహించడం చాలా కష్టం. ఎందుకంటే, ప్రతిపక్ష పార్టీలలో ప్రధానమంత్రి పదవిపై ఆశపడుతున్న వారు చాలామందే ఉన్నారు. కానీ ఎవరూ వారంతట వారుగా ఆ అత్యున్నతమైన పదవిని పొందలేరు కనుక వారు తమ కలను సాకారం చేసుకోవడానికి ఇతర పార్టీల మద్దతు, సహకారం తప్పనిసరి. .    

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ప్రధానమంత్రి రేసులో ఉన్నారని ఆ పార్టీ ఇటీవలే ప్రకటించింది. తాజాగా బిఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ప్రధానమంత్రి రేసులో ఉన్నారని ఆ పార్టీతో ఎన్నికల పొత్తులు పెట్టుకున్న సమాజ్‌వాదీ పార్టీ  అధినేత అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. 

ఈరోజు డిల్లీలోఆయన మీడియాతో మాట్లాడుతూ “ఉత్తరప్రదేశ్  రాష్ట్రం దేశానికి అనేకమంది ప్రధానమంత్రులను అందించింది. ఇప్పుడు మరో ప్రధానమంత్రిని అందించే అవకాశం కలిగితే నేను చాలా సంతోషిస్తాను. మాయావతి ప్రధానమంత్రి పదవికి పోటీ పడితే ఆమెకు మా పార్టీ సహకరిస్తుంది...మద్దతు పలుకుతుంది,” అని అన్నారు. 

జాతీయస్థాయిలో సొంతంగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే శక్తిలేని ప్రాంతీయ పార్టీలు కూడా రాబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ ఓడిపోతాయని, నరేంద్రమోడీ పదవి కోల్పోతారని, అప్పుడు తాము జాతీయస్థాయిలో చక్రం తిప్పగలమని, ప్రధాని పదవిని పొందగలమని కలలు కంటుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 ఎంపీ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, యూపీలోని 80 ఎంపీ సీట్లను ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీలు కలిసి గెలుచుకున్నా కూడా మమతా బెనర్జీ, మాయావతిల  కల నెరవేరాలంటే మిగిలిన ప్రాంతీయపార్టీలు అందుకు అంగీకరించి మద్దతు ఈయాల్సి ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. 

అఖిలేశ్ యాదవ్ కు మళ్ళీ ఎప్పటికైనా యూపీ ముఖ్యమంత్రి కావాలని కోరిక. మాయావతికి ఎప్పటికైనా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని కోరిక. వారిద్దరి ఆశలు, లక్ష్యాలు వేరు గనుకనే పరస్పరం సహకరించుకొంటున్నారు. కానీ ప్రధానమంత్రి పదవిపై ఆశలున్న ఇతర పార్టీలు వేరెవరికో ఆ పదవి దక్కించుకోవడానికి సహకరించుకొంటారని ఆశించడం అత్యశే అవుతుంది.


Related Post