టీ-కాంగ్రెస్ అధ్యక్షుడుగా అజారుద్దీన్?

July 15, 2016


img

కాంగ్రెస్ పార్టీ అంటే అనేక గ్రూపుల సమూహం. కనుక వాటి మద్య భిన్నాభిప్రాయాలు, గొడవలు కూడా సహజమే. వాటికే ‘అంతర్గత ప్రజాస్వామ్యం’ అని కాంగ్రెస్ పార్టీ ముద్దుపేరు పెట్టుకొంది. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి దానిలో అంతర్గత ప్రజాస్వామ్యం బలంగానే ఉంది. తెలంగాణా ఉద్యమాలైన తరువాత అది మరి కాస్త ఎక్కువైంది. 2014 ఎన్నికల సమయంలో ఆ అంతర్గత ప్రజాస్వామ్యం పరాకాష్టకి చేరుకోవడంతో చేతికి అందిరావలసిన అధికారం చేజారిపోయింది. ఆ దెబ్బకి పొన్నాల లక్ష్మయ్య పిసిసి అధ్యక్ష కుర్చీలో నుంచి దిగిపోక తప్పలేదు. ఆ ముళ్ళ కుర్చీలో కూర్చోవడానికి అందరికంటే యోగ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డేనని భావించి ఆయనని దానిలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. కానీ ఆ కుర్చీ క్రింద కాంగ్రెస్ అసమ్మతివాదులు పెట్టిన మంట రావణకాష్టంలాగా ఆరిపోకుండా నిత్యం భగభగ మండుతూనే ఉంటుంది. కనుక ఆ కుర్చీలో ఎవరు ఎక్కువ కాలం నిలకడగా కూర్చోలేరు. కనుక ఇప్పుడు అయోగ్యుడుగా ముద్రపడ్డ ఆ ఉత్తముడిని దింపి ఆ కుర్చీలో తాము కూర్చోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, డికె అరుణ, షబ్బీర్ అలీ, గీతారెడ్డి తదితరులు తహతహలాడుతున్నారు.

అయితే ఈ మధ్యన కాంగ్రెస్ అధిష్టానం తన పార్టీని విజయపధంలో నడిపించే పనిని అవుట్ సోర్సింగ్ కి ఇచ్చినందున ఆ బాధ్యతలు చేపట్టిన ప్రశాంత్ కిషోర్ సూచనలని తూచా తప్పకుండా ఫాలో అయిపోతోంది. ఆయనే క్రికెటర్ అజరుద్దీన్ని ఆ కుర్చీలో కూర్చోబెడితే ఇక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు ఉండదు. ఆయనే తెరాసని ఒంటి చేత్తో డకవుట్ చేసేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించేస్తారని సూచించినట్లు తాజా సమాచారం. కనుక రేసులో ఉన్నవారిని అందరినీ కాదని కాంగ్రెస్ అధిష్టానం ఆయన పేరుని పరిశీలిస్తున్నట్లు టాక్. ఈలోగా మరోవార్త కూడా మీడియాలో లీక్ అయింది. మళ్ళీ చిరంజీవితో స్టెప్పులు వేయాలని ఆలోచిస్తున్న విజయశాంతి పేరుని కూడా కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు మరో టాక్ వినిపిస్తోంది. ఈ గుసగుసలు నిజమా కాదా అనేది త్వరలోనే తేలిపోవచ్చు. కానీ ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం అజరుద్దీన్ కే బ్యాటింగ్ అవకాశం ఇస్తే దాని కోసం పోటీపడుతున్న వారు అందరూ కలిసి ఆయనని అవుట్ చేసేవరకు ఊరుకోరని ఖచ్చితంగా చెప్పవచ్చు. అప్పుడు నిలకడగా బ్యాటింగ్ చేసేందుకు ఆయన కూడా ఒక స్వంత టీం ని ఏర్పాటు చేసుకోకతప్పదు.

 టీ-కాంగ్రెస్ నేతలందరూ దేశముదురులే...కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఎదుర్కోగలిగేవారు కాకపోవడమే కాంగ్రెస్ పార్టీకి ఉన్న అతిపెద్ద డ్రాబ్యాక్ అని గ్రహించకుండా, కాంగ్రెస్ అధిష్టానం ప్రతీ ఇన్నింగ్ లో కనీసం రెండు మూడుసార్లైన కెప్టెన్ని మారుస్తూ గెలవాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ సంగతి ప్రశాంత్ కిషోర్ అయిన సోనియా మాడంకి చెపితే బాగుండేది. కానీ ఆయన కూడా కెప్టెన్ని మారిస్తే సరిపోతుందని చెపుతున్నారు..ప్చ్!  


Related Post