యూపీలో కాంగ్రెస్‌కు షాక్!

January 12, 2019


img

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షపార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బిఎస్పీ)లు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు పెద్ద షాక్ ఇచ్చాయి. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోబోమని తేల్చి చెప్పాయి. అంతేకాదు...రాష్ట్రంలో గల 80 లోక్‌సభ స్థానాలను చెరో 38 చొప్పున పంచుకొని అమేధీ, రాయ్ బరేలీ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి మిగిలిన రెండూ ఇతర పార్టీలకు విడిచిపెడుతున్నట్లు ప్రకటించాయి. 

కనుక యూపీలో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేయక తప్పదు. కానీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ లేదు కనుకనే యూపీ శాసనసభ ఎన్నికలలో ఎస్పీ ‘సైకిలు’ ఎక్కి అధికారపీఠం చేరుకోవాలని ప్రయత్నించి భంగపడింది. ఆ ఎన్నికల వరకు ఉప్పు,నిప్పులా ఉండే ఎస్పీ, బీఎస్పీలు ఇప్పుడు కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కూడా లోక్‌సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారే అవకాశం ఉంది. 

దేశంలో అత్యధిక ఎంపీ సీట్లున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకోగలుగుతుందో ఆ పార్టీకే కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక ఎస్పీ, బీఎస్పీల నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. మూడు ప్రధానమైన బిజెపి రాష్ట్రాలను చేజిక్కించుకొని మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ, యూపీలో ఏవిధంగా నెగ్గుకొస్తుందో చూడాలి.


Related Post