ఏపీలో పొత్తుల్లేవ్...దోస్తీ మాత్రమే!

January 11, 2019


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్-టిడిపిల పొత్తులు వికటించడంతో త్వరలో జరుగబోయే లోక్‌సభ మరియు ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పొత్తులు పెట్టుకోకుండా వేర్వేరుగా పోటీ చేయాలని రాహుల్ గాంధీ-చంద్రబాబునాయుడు నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

కాంగ్రెస్ పార్టీ తమ అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీ ప్రజలు 2014 ఎన్నికలలో కాంగ్రెస్‌తో నేతలకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టారు. కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రజలు కాంగ్రెస్‌తో పాటు టిడిపిని కూడా తిరస్కరిస్తే నష్టపోతామనే భయం చంద్రబాబుకు ఉండవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌-టిడీపీలు వేర్వేరుగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తాజా సమాచారం. 

అయితే మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే రెండు పార్టీల లక్ష్యం కనుక జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. కనుక త్వరలో అమరావతిలో టిడిపి నిర్వహించబోతున్న ధర్మపోరాటదీక్షకు రాహుల్ గాంధీని చంద్రబాబునాయుడు ఆహ్వానించినట్లు సమాచారం. 

కాంగ్రెస్‌-టిడిపిలు పొత్తులు పెట్టుకొనప్పటికీ వాటి మద్య సఖ్యత ఉందని, లోక్‌సభ ఎన్నికల తరువాత అవి కలిసి పనిచేస్తాయని ఏపీ ప్రజలకు తెలిసి ఉన్నప్పుడు వారు టిడిపికి ఓటేస్తారో లేదో అనుమానమే. కనుక కాంగ్రెస్ పార్టీతో పరోక్షంగా దోస్తీ కూడా టిడిపికి నష్టం కలిగించే అవకాశాలున్నాయని భావించవచ్చు. 

సిఎం కేసీఆర్‌-ప్రధాని మోడీల దోస్తీ కారణంగా తెలంగాణలో బిజెపి ఏవిధంగా నష్టపోయిందో, అదేవిధంగా రాహుల్-బాబు దోస్తీ వలన ఏపీలో కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోవచ్చు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామమాత్రంగా మిగిలుంది కనుక దానికి కొత్తగా నష్టపోయేదేమీ ఉండదు. లోక్‌సభ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్‌ మిత్రపక్షాలు ప్రభుత్వ ఏర్పాటుకు తగినంత సీట్లు సాధించగలిగితే కాంగ్రెస్-టిడిపిలు రెంటికీ పరస్పరం ఎంతో కొంత మేలు కలుగవచ్చు. 


Related Post