సత్తుపల్లిలో జరిగినట్లే మిగిలిన చోట్ల జరిగి ఉంటే...

January 11, 2019


img

 ఖమ్మం తెరాస ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం సత్తుపల్లిలో విలేఖరులతో మాట్లాడుతూ నియోజకవర్గంలో తెరాస ఓటమికి కారణాలను విశ్లేషించారు. నియోజకవర్గంలో కూటమి ఐక్యత, గిరిజనులను ప్రభావితం చేసే వ్యూహాలు, కూటమిలో పార్టీల మద్య ఓట్ల బదలాయింపు వంటి కారాణాలతో సత్తుపల్లిలో టిటిడిపి అభ్యర్ధి సండ్ర వెంకట వీరయ్య విజయం సాధించగలిగారని చెప్పారు. 

తెరాస వైఫల్యాలను వివరిస్తూ తెరాస నేతలు, ప్రజాప్రతినిధులు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకపోవడం, స్థానిక ప్రజలతో సంబందాలు నెరపకపోవడం, తెరాసలో అంతర్గత రాజకీయాల కారణంగా పిడమర్తి ఓటమి పాలయ్యారు తప్ప తాను ఆయనకు వెన్నుపోటు పొడవలేదని అన్నారు. కనుక నియోజకవర్గంలో తెరాస నేతలందరూ ఆత్మవిమర్శ చేసుకొని లోపాలను సవరించుకొని ముందుకు సాగాలి తప్ప తనపై బురదజల్లడం సరికాదని శ్రీనివాసరెడ్డి అన్నారు. 

తెరాసలో ఇటువంటి అంతర్గత సమస్యలు ఇంచుమించు అన్ని నియోజకవర్గాలలో ఉన్నాయి కానీ వాటిని అధిగమించి తెరాస విజయం సాధించింది. కనుక శ్రీనివాసరెడ్డి చెప్పినట్లు కూటమిలో పార్టీల మద్య ఓట్ల బదలాయింపు సక్రమంగా జరిగినందునే టిటిడిపి అభ్యర్ధి గెలిచినట్లు స్పష్టం అవుతోంది. నిజానికి ఇదే ఆలోచనతో కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పడింది. అయితే రాష్ట్ర స్థాయిలో కూటమి నేతల మద్య సఖ్యత ఏర్పడింది కానీ జిల్లా, నియోజకవర్గం, గ్రామ స్థాయిలో ఆ నాలుగు పార్టీల నేతలు, కార్యకర్తల మద్య సఖ్యత ఏర్పడలేదు. కానీ ఎన్నికల ప్రచారానికి తగినంత సమయం లేకపోవడం చేత కూటమి అగ్రనేతలు ఈ సమస్యను పట్టించుకోలేదు. 

అదే...వారు ఎన్నికలకు రెండు నెలల ముందుగానే సీట్ల సర్దుబాట్లు చేసుకొని నియోజకవర్గం వారీగా నాలుగు పార్టీల నేతలను, కార్యకర్తల మద్య అవగాహన, సఖ్యత ఏర్పడేలా చేయగలిగి ఉండి ఉంటే, అసెంబ్లీ ఎన్నికలలో ప్రజాకూటమి విజయం సాధించి ఉండేదేమో? ఒకవేళ విజయం సాధించలేకపోయినా, తెరాసతో సమానంగా సీట్లు గెలుచుకొని ఉండేదేమో? కనుక ఒకవేళ ఆ నాలుగు పార్టీలు మున్ముందు కూడా కలిసి సాగాలనుకొంటున్నట్లయితే, ఇకపై గ్రామస్థాయి వరకు ఆ నాలుగు పార్టీల నేతలు, కార్యకర్తల మద్య పరస్పర అవగాహన, సఖ్యత ఏర్పడేందుకు తగిన ఉమ్మడి కార్యక్రమాలు రూపొందించుకుంటే మంచిది. తద్వారా తెరాస ఒత్తిళ్లను తట్టుకొంటూ వచ్చే ఎన్నికల వరకు ఆ నాలుగు పార్టీలు మనుగడ సాగించగలుగుతాయి కూడా. 


Related Post