కాంగ్రెస్ లో కీచులాటలు...మామూలే కదా!

January 10, 2019


img

పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. వారి నిర్ణయాన్ని తప్పుపడుతూ ఆయన డిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన తన కుటుంబ సభ్యులను కూడా గెలిపించుకోలేకపోయాడు ఇక పార్టీని ఏమి గెలిపిస్తారు? ఆయన టికెట్లను అమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేకూర్చారు. పార్టీ ఓడిపోతే మళ్ళీ గాంధీభవన్‌లో మెట్లు తొక్కనన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ గాంధీభవన్‌కు ఎందుకు వస్తున్నారు? నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అర్హత, అధికారం ఆయనకు లేవు. అసలు నన్ను కాదు...ముందు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. అప్పుడే కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని వదులుతుంది,” అని అన్నారు. 

తమపై సర్వే డిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేయడంపై కుంతియా స్పందిస్తూ, “అందులో తప్పేమీ లేదు. పార్టీలో ఎవరైనా కాంగ్రెస్ అధిష్టానాన్ని కలవవచ్చు. వారి గోడు మొరపెట్టుకోవచ్చు. మా నిర్ణయంపై ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకొంటుంది,” అని అన్నారు. 

అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడినప్పుడు కాంగ్రెస్ నేతలు అందరూ ఏకతాటిపై నిలిచి తెరాసను ఎదుర్కోవాలి కానీ వారిలో వారే ఈవిధంగా కీచులాడుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇది మామూలే. కాంగ్రెస్ నేతలు కీచులాడుకోకపోతేనే ఆశ్చర్యపోవాలి.


Related Post