మోడీకి రాహుల్ సమ ఉజ్జీయేనా?

January 10, 2019


img

రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలు కుంభకోణంపై లోక్‌సభలో తానడిగిన ప్రశ్నలకు ప్రధాని నరేంద్రమోడీ సమాధానం చెప్పలేక రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ వెనుక దాకొన్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. “56 అంగుళాల ఛాతి ఉన్న కాపలాదారు మోడీ లోక్‌సభలో నన్ను ఎదుర్కొనలేక నిర్మలా సీతారామన్ కు ఆ బాధ్యతలు అప్పగించి పారిపోయారు. ఆ కుంభకోణంలో రూ.30,000 కోట్ల ప్రజాధనాన్ని ప్రధాని మోడీ దొంగలకు అప్పగించారు. దీనిపై ఆయన మౌనం  వహించి సమాధానం చెప్పకుండా తప్పించుకోవాలంటే కుదరదు. మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కుంభకోణంపై తప్పకుండా విచారణ జరిపిస్తాము,” అని అన్నారు. 

ఇది రక్షణశాఖకు సంబందించిన వ్యవహారం కనుకనే రాహుల్ గాంధీ ప్రశ్నలకు రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానాలు చెపుతున్నారు. కానీ ఆమె ఒక మహిళ కనుక లోక్‌సభలో ఆమె చెప్పిన సమాధానాలకు ఎటువంటి విలువలేదని, కేవలం ప్రధాని నరేంద్రమోడీ చెపితేనే పరిగణనలోకి తీసుకోవచ్చుననే భావన రాహుల్ మాటలలో కనిపిస్తోంది. మహిళల పట్ల చులకనభావం ప్రదర్శిస్తున్నట్లుంది. ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే కొన్ని మహిళాసంఘాలు అభ్యంతరాలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమీషన్ ఈరోజు రాహుల్ గాంధీని సంజాయిషీ కోరుతూ నోటీసు పంపింది. 

అయితే రాహుల్ గాంధీ ప్రధాని మోడీని రెచ్చగొట్టే విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అని ఆలోచిస్తే అనేక కారణాలు కనిపిస్తున్నాయి.  

ప్రధాని మోడీని ఏదోవిధంగా ఈ వివాదంలోకి లాగి ఆయన చేత మాట్లాడించినట్లయితేనే ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ తన యుద్దం కొనసాగించగలుగుతుంది. రాహుల్ గాంధీతో మోడీ మాటల యుద్దానికి సిద్దపడితే ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ సమఉజ్జీ అనే భావన ప్రజలలో కలుగుతుంది. అంతేకాదు... మోడీ మాట్లాడటం మొదలుపెడితే ఈ వ్యవహారంపై దేశప్రజలు కూడా ఆసక్తి చూపుతారు కనుక దానికి మరింత ప్రాధాన్యత లభిస్తుంది. తద్వారా ఈ వ్యవహారంపై ప్రజలలో అపోహలు, అనుమానాలు కూడా పెరుగుతాయి. పైగా పార్లమెంటు ఎన్నికల వరకు ఈ వేడి చల్లారిపోకుండా ఉంటుంది కనుక ఎన్నికలలో ప్రధాని మోడీని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు సంపాదించుకోవాలని రాహుల్ గాంధీ ఆలోచనగా కనిపిస్తోంది. 

నిజానికి రాహుల్ గాంధీ నిన్న మొన్నటివరకు తల్లి, అక్క చాటు బిడ్డగానే మెలిగారనే సంగతి అందరికీ తెలిసిందే. కానీ నరేంద్రమోడీ స్వీయశక్తితో ఒక కార్యకర్త స్థాయి నుంచి దేశప్రధాని కాగలిగారు. ఏడు దశాబ్ధాలలో కాంగ్రెస్ పార్టీ చేయలేని అనేక పనులను, సాహసోపేతమైన నిర్ణయాలను అమలుచేసి చూపిస్తూ తన నాయకత్వ లక్షణాలను చాటుకొంటున్నారు. నరేంద్రమోడీ దేశాన్ని, బిజెపిని స్వయంగా నడిపిస్తుంటే, నెహ్రూ వంశానికి చెందినవారనే ఏకైక కారణంతోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవి పొందిన రాహుల్ గాంధీ పార్టీలో సీనియర్ల సహాయంతో పార్టీని నడిపిస్తున్నారు. కనుక రాహుల్ గాంధీ ఎన్నటికీ ప్రధాని నరేంద్రమోడీకి సమ ఉజ్జీ కాలేరని చెప్పవచ్చు. 


Related Post