జనవరి 16న కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం

January 10, 2019


img

కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జనవరి 16న జరుగబోతోంది. పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో జరుగబోయే ఈ కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శాసనసభాపక్ష నేతను ఎన్నుకొంటారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ అధ్వర్యంలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఆయన ఈనెల 15వ తేదీన డిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకొని పార్టీ శాసనసభ్యులతో ఈ అంశంపై చర్చించి శాసనసభాపక్ష నేత పేరును ఖరారు చేస్తారు. అనంతరం లాంఛనంగా ఎన్నిక జరుగుతుంది. 

గెలుపోటములతో సంబంధం లేకుండా కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ పదవులకోసం పోటీ పడుతుంటారు కనుక ఈసారి కూడా పోటీ పడుతున్నారు. ఇంతకు ముందు కె జానారెడ్డి శాసనసభాపక్ష నేతగా ఉండేవారు కానీ ఈసారి ఎన్నికలలో ఆయన ఓడిపోవడంతో వేరేవారికి ఆ అవకాశం లభించనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, గండ్ర వెంకటరమణ రెడ్డి వంటి సీనియర్లున్నారు. వారిలో ఎవరో ఒకరికి అవకాశం లభించవచ్చు. 

అయితే గత ఎన్నికలలో ఓటమి తరువాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఎప్పటికైనా కోలుకోగలదనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంగా కనిపిస్తోంది. తెరాస ఒత్తిళ్లను తట్టుకొని వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించగలదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితిని ఏపీలో కాంగ్రెస్ పార్టీతో పోల్చవచ్చు. శాసనసభలో బలహీనపడిన కాంగ్రెస్ విజయోత్సాహంతో ఉన్న తెరాసను ఎదుర్కోవడం కష్టం. అలాగే బయట ఒకపక్క పార్టీ శ్రేణులను కాపాడుకొంటూ మరోపక్క తెరాసను గట్టిగా ఎదుర్కోవడం కూడా కష్టమే. కనుక కాంగ్రెస్ పార్టీకి శాసనసభలోనూ బయటా ఎవరు నాయకత్వం వహించినా వారికి ఆ పదవులు అగ్నిపరీక్షగానే భావించవచ్చు.


Related Post